Kamareddy Rainfall | కామారెడ్డిలో విస్తారంగా వర్షాలు.. ఊపందుకున్న సాగు పనులు

వర్షాలు పడుతుండటంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. వరినాట్లు ఊపందుకున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kamareddy Rainfall | ఈ ఏడాది ఎల్​నినో ప్రభావంతో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వానాకాలం సీజన్ ప్రారంభమై నెలరోజులైనా ఆశించినంతగా వర్షాలు కురవలేదు. ఎట్టకేలకు నెలాఖరు నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఖరీఫ్​పై బోలెడంత ఆశలు పెట్టుకున్న రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది.

Kamareddy Rainfall | జిల్లావ్యాప్తంగా వరికే మొగ్గు..

జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో 1.70 లక్షల ఎకరాల్లో వరి పంట, 1.83 లక్షల ఎకరాల్లో వర్షాధార రకాల పంటలు సాగుపుతాయని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా 1.20 లక్షల ఎకరాల్లో నాట్లు వేసేందుకు భూములు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఏడాది ఎల్‌నినోతో ముప్పు పొంచి ఉందని, వర్షాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటలు సాగు చేయాలని, వరికి బదులు ఆరుతడి పంటలు సాగు లాభదాయకమంటూ రైతులకు విన్నతంగా అవగాహన కల్పించారు. అయినా రైతులు (Farmers) ఎప్పటిలాగే వరిసాగుకు మొగ్గు చూపారు.

Kamareddy Rainfall | బోరుబావుల ఆధారంగా..

బోరుబావుల ఆధారంగా తుకాలు పోశారు. గత నెల ఆడపాదడపా కురిసిన వర్షాలకు వేసిన దుక్కులు దున్ని సాగుకు సిద్ధమయ్యారు. అదే విధంగా పత్తి విత్తనాలు వేశారు. కాగా జూన్‌లో లోటు వర్షపాతం నమోదైంది. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. ఎల్‌నినోతో ముప్పు తప్పదేమోనంటూ ఆవేదన చెందారు. భూమిలో వేసిన విత్తను దక్కించుకునేందుకు నానాతంటాలు పడ్డారు. వివిధ మార్గాల ద్వారా నీటి తడులు అందించి విత్తును దక్కించుకున్నారు. కాగా, ఈ నెలాఖరు నుంచే జిల్లాలో వాతావరణంలో భారీమార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వర్షాధారంగా సాగు చేసిన పత్తి, ఇతర ఆరుతడి పంటలకు ఊపిరి పోసినట్లయ్యింది.

Kamareddy Rainfall | ఆశాజనకంగా భూగర్భజలాలు

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భజలాలు స్థితం ఆశాజనకంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది భారీ వర్షాలు కురవటంతో చెరువులు, కుంటలు నమృద్ధిగా నిండి ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. జూన్‌లో సగటున 12.97 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా, జూలైలో13.47 మీటర్లకు పడిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భూగర్భ జల మట్టాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Kamareddy Rainfall | బోరు బావుల కింద నాట్లు

గత వారం రోజులుగా సమృద్ధిగా వర్షాలు కురవడంతో సాగు పనులు ఊపందుకున్నాయి. అన్నదాతలు పొలాల్లో వివిధ పనులు చేస్తూ బిజీగా మారారు. కొందరు సాగునీటి ఆధారంగా బోరు బావుల కింద వరి నాట్లు ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకు నాట్లు వేస్తే ఆశించిన దిగుబడి వస్తుందని, లేకపోతే నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.

Kamareddy Rainfall | పోచారం ప్రాజెక్టులోకి ఇన్​ఫ్లో..

నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాలకు వరప్రదాయిని అయిన పోచారం ప్రాజెక్ట్​లోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది.సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాలైన గాంధారి, లింగంపేట, తాడ్వాయి, గుండారం వాగుల ద్వారా బుధవారం 1,526 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1.82 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.228 టీఎంసీలు నీరు ఉంది. పోచారం ప్రాజెక్ట్‌లోకి వరద నీరు రావడంతో మండలంలోని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కళ్యాణి ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడంతో నిజాంసాగర్ ప్రధాన కాలువ లోకి, రెండు వరద గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Banswada MCH Protest | బాన్సువాడ ఎంసీహెచ్​లో వైద్య సిబ్బంది రెండో రోజూ నిరసన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *