అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Dhanpal Suryanarayana | నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అంకాపూర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy)కి మద్దతు తెలిపేందుకు బయలుదేరిన ఆయనను పోలీసులు ఇంటి వద్దే అడ్డుకున్నారు.
Dhanpal Suryanarayana | హామీల అమలులో విఫలం
ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అనవసర వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. గత రెండున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై తాము ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధిని వివరించే ధైర్యం కాంగ్రెస్ నాయకత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
Dhanpal Suryanarayana | వేలమంది విద్యార్థుల భవిష్యత్తు..

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, మరోవైపు ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేస్తోందని ధన్‌పాల్ ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను, రాజకీయ నాయకులను అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చేయడం అప్రజాస్వామిక చర్య అని ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంటే, దానిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు వెళ్తుండగా ఎక్కడికక్కడ వారిని అడ్డుకోవడం, అరెస్టులు చేయడం ప్రభుత్వ అసహన వైఖరికి నిదర్శనమని అన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Theft | కామారెడ్డిలో దొంగల హల్చల్.. విద్యుత్ ఉద్యోగి ఇంట్లో చోరీ