Nizamabad Land Scam | జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్

నిజామాబాద్ జిల్లాలో భారీ భూ స్కాం ఒకటి వెలుగు చూసింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad Land Scam | నిజామాబాద్ జిల్లాలో భారీ భూ స్కాం ఒకటి వెలుగు చూసింది. ఏకంగా 22A జాబితాలో ఉన్న ప్రోహిబిటేడ్ భూమికి అధికారులు రిజిస్ట్రేషన్ చేసి పెట్టారు. ఈ భూమి విలువ సుమారు రూ.6 కోట్ల పైచిలుకు ఉండడం గమనార్హం.

నిజామాబాద్ (Nizamabad) అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో గత నెల ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగింది. కాగా.. ఈ భూమి పూర్తిగా నిషేధిత జాబితాలో ఉంది. ఫారెస్ట్ భూమికి ఆనుకుని ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని కొందరు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాదు అడ్డదారిలో తమ పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేసి పెట్టారు.

Nizamabad Land Scam | అర్సపల్లి శివారులో..

నిజామాబాద్ నార్త్ మండలం పరిధిలోని అర్సపల్లి శివారు సర్వే నంబరు 249 పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్. ఈ భూమికి సంబంధించి ఎవరికీ ఎలాంటి హక్కులు లేవు. ఒకవేళ అసైన్డ్ హక్కులు కల్పించినా రిజిస్ట్రేషన్ వీలుకాదు. అధికారులకు కూడా ఈ అధికారం లేదు. కానీ, ఇవన్నీ పక్కనబెట్టి నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారి గత నెల అంటే సెప్టెంబరులో డాక్యుమెంట్ పూర్తి చేశారు. డాక్యుమెంట్​లో మొత్తం 6,666 గజాలు దాదాపు ఎకరంన్నర భూమికి ఎలాంటి పరిశీలన చేయకుండా రిజిస్ట్రేషన్ చేసి పెట్టడం గమనార్హం. ఈ భూమి సర్వే నంబరు 249/1 కాగా.. ఇది పూర్తిగా ప్రొహెబిటెడ్ లిస్టులో ఉంది.

Nizamabad Land Scam | ఫేక్​ సర్టిఫికెట్లు సృష్టించి..

అక్రమార్కులు ఇంతటితో ఆగలేదు. ఈ భూమిని తమ సొంతం చేసుకునేందుకు ఏకంగా ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించారు. ఫేక్ పట్టా, నకిలీ నాలా పత్రం సమర్పించారు. డాక్యుమెంట్ వచ్చిందే అదునుగా ఎలాంటి వెరిఫై చేయకుండానే అర్బన్ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో లక్షలు చేతులు మారినట్లు కోడై కూస్తోంది.

Nizamabad Land Scam | కబ్జా వ్యవహారంపై ఫిర్యాదు

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ కబ్జా వ్యవహారంపై గత నెల 24న ఓ వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కోట్లాది రూపాయలు విలువ చేసే గవర్నమెంట్ ల్యాండ్​ను కబ్జా చేయడమే కాకుండా తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ ఆఫీసులో ఇచ్చిన ఈ ఫిర్యాదు కాపీని అక్కడి సిబ్బంది తొక్కిపెట్టినట్లు తెలుస్తోంది. ఏళ్లుగా డీఐజీ కార్యాలయంలో పాతుకుపోయిన ఉద్యోగి ఒకరు ఈ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. అసలు వృత్తిని వదిలేసి సొంత వ్యాపకాలకు పరిమితమైన ఈ స్వామి.. ఇప్పుడు ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం సైతం బయటకు రాకుండా అన్నీ తానై మేనేజ్ చేయడం వెనుక రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక.. ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ విషయమై జిల్లా కలెక్టర్ విచారణ చేయించాల్సి ఉంది. ప్రభుత్వ భూముల కబ్జా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా ఉంది. కానీ, కిందిస్థాయి అధికారులు ఈ 22A జాబితాను సైతం లెక్కచేయకుండా ఇలా అక్రమాలకు పాల్పడటం గమనార్హం.

ఇది కూడా చదవండి..: BRS Former MLAs | ష్​.. గప్​చుప్​.. బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యేల్లో నైరాశ్యమేల..?

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *