అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Theft Arrest | అత్త వరుసైన మహిళ ఇంట్లో ఆభరణాలు చోరీ( Gold Theft Case) చేసిన అల్లుడిని పోలీసులు (Kamareddy) అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం డీఎస్పీ మధుసూదన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
Kamareddy Theft Arrest | గంజి రోడ్డుకు చెందిన..
గంజి రోడ్డుకు చెందిన కొత్తూరి పద్మ గత నెల 28న రాత్రి 8 గంటల సమయంలో బీరువాలో బంగారు కమ్మలు, పుస్తెలు, గుండ్లు, పుస్తెల తాడు భద్రపర్చారు. తిరిగి చూసేసరికి ఆభరణాలు కనిపించలేదు. కుటుంబ సభ్యులతో వెతికినా లభించకపోవడంతో ఈ నెల 30న కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో హరిజనవాడకు చెందిన చింతకింద బాలమురళీకృష్ణను అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు.
ఫిర్యాదు చేసిన మహిళ తనకు వరుసకు అత్త కావడంతో గతంలో ఇంటి తాళాలు తన వద్ద ఉండేవని, ఇంట్లో నగలు ఎక్కడ ఉంచుతారో తెలిసి ఉండటంతో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు తెలిపాడు. కుటుంబ పోషణకు ఆదాయం సరిపోక తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో ఈ పనికి పాల్పడినట్లు చెప్పాడు. చోరీ చేసిన బంగారు కమ్మలను ఐఐఎఫ్ఎల్లో, బంగారు చైన్‌ను కాప్రి గోల్డ్ లోన్స్‌లో తాకట్టు పెట్టగా, మూడు బంగారు పుస్తెలను తన టిఫిన్ సెంటర్లో దాచిపెట్టాడు. నిందితుడు చూపిన ప్రదేశాల ఆధారంగా పంచుల సమక్షంలో మూడు చోట్ల నుంచి మొత్తం 3 తులాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు.
ఇది కూడా చదవండి: ఓటరు ఫారం సమర్పించిన ఉపరాష్ట్రపతి