అక్షరటుడే, భీమ్‌గల్(వేల్పూర్): MLA Prashanth Reddy | తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం తీవ్ర విధ్వంసానికి గురైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. వేల్పూర్ (Velpur) ఎక్స్ రోడ్ వద్ద గురువారం నిర్వహించిన భారీ ‘రైతు సదస్సు’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
MLA Prashanth Reddy | కేసీఆర్ పాలనలో రైతే రాజు..
కేసీఆర్ పాలనలో రాజుగా బతికిన రైతు.. నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో తీవ్ర దగాకు గురవుతున్నాడని ప్రశాంత్‌రెడ్డి పేర్కొనారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, మిషన్ కాకతీయతో (Mission Kakatiya) చెరువుల పునరుద్ధరణ, ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో ఆయకట్టుకు పుష్కలంగా నీరు అందించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ వచ్చాక విద్యుత్ కోతలు పెరిగాయని, కాళేశ్వరం పంపులు ఆన్ చేయకపోవడం వల్ల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్ యాప్‌ల పేరిట ఎరువుల సరఫరాలో రైతులను తిప్పలు పెడుతున్నారని, యాప్‌ల విధానాన్ని వెంటనే రద్దు చేసి నేరుగా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
MLA Prashanth Reddy | రుణమాఫీ చేయాలి
షరతులు లేకుండా రూ.2 లక్షల సంపూర్ణ రుణమాఫీ అమలు చేయాలని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఎకరానికి రూ.15 వేల రైతుభరోసాను పాత బకాయిలతో సహా ఖాతాల్లో జమ చేయాలని.. అన్ని పంటలకూ క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి ఎస్సారెస్పీ, వరద కాలువను నింపాలని సూచించారు. రద్దు చేసిన రైతుబీమా ప్రీమియంను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కేఆర్ సురేష్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మీడియా ముందుకు వచ్చి మీసం తిప్పిన కొండా మురళీ