Pending Wages in Bank | బ్యాంకులో చిక్కుకున్న రూ.50 లక్షల వేతనాలు.. మేనేజర్​తో సర్పంచులు, కార్మికుల వాగ్వాదం

నెలలుగా జీతాలు అందక గాంధారి మండలంలోని పంచాయతీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Pending Wages in Bank | జీతం కోసం చెమటోడ్చిన పంచాయతీ కార్మికులకు(Panchayat Workers) చుక్కెదురైంది. ప్రభుత్వం జమ చేసిన వేతనాలు బ్యాంకులోనే పెండింగ్ పడ్డాయి.

Pending Wages in Bank | అక్షరాలు రూ.50లక్షలకు పైగా..

అక్షరాలా రూ.50 లక్షలకు పైగా మొత్తం నిలిచిపోవడంతో కార్మికులు లబోదిబోమంటున్నారు. గాంధారి (Gandhari) మండలంలో 45 గ్రామ పంచాయతీలు ఉండగా, 38 పంచాయతీలకు చెందిన వంద మందికి పైగా కార్మికులకు కామారెడ్డిలోని (Kamareddy) కోటక్ మహీంద్రా బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే జీతాలు నేరుగా ఈ ఖాతాల్లోనే జమ అవుతాయి. అయితే గత 13 నెలలుగా జమ అవుతున్న జీతాలను బ్యాంకు అధికారులు విడుదల చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విసిగిపోయిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కార్మికులు గురువారం మూకుమ్మడిగా బ్యాంకుకు చేరుకుని మేనేజర్​ను నిలదీశారు. కార్మికులు, సర్పంచుల కథనం ప్రకారం.. ప్రత్యేక అధికారుల పాలనలో 8 నెలల జీతాలను ప్రభుత్వం జమ చేసింది.

Pending Wages in Bank | టెక్నికల్​ ఇష్యూతోనే..

తాజాగా ఎన్నికైన సర్పంచుల హయాంలో టీఎస్-బీపాస్ తర్వాత మరో 5 నెలల జీతాలు కూడా జమ అయ్యాయి. అయితే ఖాతాల బదిలీ పేరుతో బ్యాంకు అధికారులు మెలిక పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. మొత్తం రూ.50 నుంచి 60 లక్షల వరకు బకాయి ఉండగా, ఇప్పుడు మేనేజర్ మాత్రం టీఎస్-బీపాస్ తర్వాత వచ్చిన 5 నెలల జీతాలే ఇస్తామని, గత 8 నెలల సంగతి తమకు తెలియదని చెబుతున్నారని కార్మికులు వాపోతున్నారు.

తాను రెండు నెలల క్రితమే బదిలీపై వచ్చానని, టెక్నికల్ ఇష్యూ వల్లే జాప్యం జరిగిందని మేనేజర్ బదులిచ్చారు. శుక్రవారం వరకు గడువు ఇవ్వాలని, సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జీతాలు లేక పూట గడవడం కష్టంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారంలోగా పరిష్కారం కాకపోతే మండలంలోని అన్ని గ్రామాల నుంచి కార్మికులు, సర్పంచులు, కార్యదర్శులతో కలెక్టరేట్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *