అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Road Works | ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బీటీ రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టేందుకు ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) జగదీశ్వర్‌ను కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు.
Yellareddy Road Works | అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పటికీ..
రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరై, కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు చేసుకుని నాలుగైదు ఏళ్లు గడుస్తున్నప్పటికీ పనులు ప్రారంభించకపోవడంపై ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రోడ్లు లేక గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు, విద్యార్థులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. నాగిరెడ్డిపేట మండలంలో గోలిలింగాల, రాఘవపల్లి, ఎర్రారం, ఆత్మకూరు, బొల్లారం మీదుగా జప్తి జానకంపల్లి రోడ్డు, తాండూర్ నుంచి మసానిపల్లి రోడ్డు, వాడి మీదుగా చీనూర్ రోడ్డు నిర్మాణాలను చేపట్టాలని కోరారు. సదాశివనగర్ మండలంలో ఉత్నూర్ నుంచి తుక్కోజివాడి మీదుగా భూమ్‌పల్లి రోడ్డు, జాతీయ రహదారి-44 నుంచి ధర్మారావుపేట మీదుగా అమర్లబండ రోడ్డు, ఎల్లారెడ్డి మండలంలో వెల్లుట్ల మీదుగా తిమ్మారెడ్డి రోడ్డు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Yellareddy Road Works | గాంధారి మండలంలో..
గాంధారి నుంచి చద్మల్తండా మీదుగా పిస్కుల్ గుట్ట తండా, పెద్ద గుజ్జుల్ తండా, చిన్న గుజ్జుల్ తండా, లోంక తండా, దాపు తండా, బీర్మల్ తండా వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. వీటితోపాటు నియోజకవర్గంలోని ఇతర ముఖ్యమైన రోడ్ల పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. ఏళ్ల తరబడి పనులు ప్రారంభించకుండా కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్ల అగ్రిమెంట్లను రద్దు చేసి, రీ-టెండరింగ్ ప్రక్రియ చేపట్టాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈఎన్‌సీని కోరారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలపై ఈఎన్‌సీ జగదీశ్వర్ సానుకూలంగా స్పందిస్తూ, పెండింగ్ రోడ్డు పనులను పరిశీలించి త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Food Safety Inspections | కామారెడ్డి రెస్టారెంట్లపై ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీలు