అక్షరటుడే, కామారెడ్డి: BRS Former MLAs | తెలంగాణ ఉద్యమంలో అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కంచుకోట. ఉద్యమం మొదట్లోనే మొదటి జడ్పీ ఛైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగురవేసింది. 2014 ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన ఏకైక జిల్లాగా చరిత్ర సృష్టించింది. అలాంటి జిల్లాలో ప్రస్తుతం బీఆర్ఎస్ హవా అంతంతమాత్రంగానే అన్నట్లు మారిపోయిందని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
BRS Former MLAs | తొమ్మిది నియోజకవర్గాల్లో..
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ, బాల్కొండ మినహా అన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. బాన్సువాడలో విచిత్ర పరిస్థితి నెలకొనగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్కరే ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మూడేళ్లుగా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా వెళ్లడంలో మాజీ ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారన్న టాక్ వినిపిస్తోంది. వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మినహా మిగతా మాజీల పేర్లు ఎక్కడా వినిపించడం లేదన్న చర్చ సాగుతోంది.
BRS Former MLAs | ప్రజల్లోకి వెళ్లని మాజీ ఎమ్మెల్యేలు..?
అధికారం కోల్పోయి దాదాపు మూడేళ్లు కావస్తున్నా మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో యాక్టివ్గా లేరన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అధిష్టానం ఆరోపిస్తున్నా, దాన్ని అస్త్రంగా మలుచుకోవడంలో నాయకులు విఫలమవుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో తప్ప ప్రజా సమస్యలపై పోరాటం, గ్రామాల్లో పర్యటనలు చేయడం లేదన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
BRS Former MLAs | నిత్యం వార్తల్లో నిలుస్తున్న జాజాల, వేముల
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నది ఇద్దరే. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. రైతు సమస్యలు, యూరియా కొరత, ధాన్యం కొనుగోళ్లు, హామీల అమలు వంటి అంశాలపై వీరిద్దరూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఏ నిరసనకు బయలుదేరినా పోలీసులు వారిని చుట్టుముట్టి హౌస్ అరెస్ట్ చేయడం, ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. దీంతో వీళ్లిద్దరే యాక్టివ్ లీడర్లుగా జనంలో ముద్రపడింది.
BRS Former MLAs | పార్టీ పిలుపిస్తేనే ధర్నాలు.. రాస్తారోకోలు
మిగిలిన మాజీల తీరు భిన్నంగా ఉందన్న టాక్ ఉంది. హైదరాబాద్ నుంచి అధిష్టానం పిలుపు ఇస్తేనే జిల్లా కేంద్రం, నియోజకవర్గాల్లో జరిగే ధర్నాలు, రాస్తారోకోలకు హాజరవుతున్నారు. సొంతంగా కార్యాచరణ రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. దీంతో కేవలం ఫొటోలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
BRS Former MLAs | నేతల్లో కొరవడిన సమన్వయం
ఉమ్మడి జిల్లా నేతల మధ్య సమన్వయం పూర్తిగా లోపించింది. ఒక నియోజకవర్గ నేత మరో నియోజకవర్గ కార్యక్రమానికి వెళ్లడం లేదు. జిల్లా స్థాయి సమావేశాల్లో కూడా అందరూ ఒకే వేదికపై కనిపించిన దాఖలాలు అంతంతమాత్రమే. గ్రూపు రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలతో ఉమ్మడిగా పోరాటం చేయలేకపోతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఫలితంగా ఉద్యమ సమయంలో ఉన్న ఊపు ఇప్పుడు లేకుండా పోయిందని అంటున్నారు.
BRS Former MLAs | దిశానిర్దేశం చేయడంలో అధిష్టానం విఫలమైందా..?
మాజీలను క్రియాశీలకం చేయడంలో అధిష్టానం విఫలమైందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఓటమి తర్వాత నేతల్లో ఆత్మవిశ్వాసం నింపి క్షేత్రస్థాయిలో పనిచేసేలా కార్యాచరణ ఇవ్వాల్సిన బాధ్యత పెద్దలపై ఉంది. కానీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలపై ఫోకస్ చేయడం లేదన్న టాక్ ఉంది. కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ ఓటమి తర్వాత ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ఒక్క బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయకపోవడం, ఓటమికి గల కారణాలపై విశ్లేషణ జరగకపోవడం మైనస్ గా చెబుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తే పూర్వ వైభవం వస్తుందన్న టాక్ క్యాడర్లో వినిపిస్తోంది.
BRS Former MLAs | క్యాడర్ బలంగా ఉన్నా ఫలితం శూన్యం
రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఉమ్మడి జిల్లాలో కిందిస్థాయిలో బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పటికీ బలంగానే ఉంది. గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నడిపించే నాయకత్వం క్షేత్రస్థాయిలో లేకపోవడంతో ఆ బలం ఓట్లుగా మారడం లేదు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత జిల్లా కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలు ప్రకటించకపోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలు నియమిస్తే క్యాడర్లో జోష్ వస్తుందని, పదవులపై ఆశలున్న వారికి పనిచేయాలన్న ఆసక్తి పెరుగుతుందని క్యాడర్ చెబుతోంది. మరి ఉమ్మడి జిల్లా నేతలు యాక్టివ్ అవుతారా.. అధిష్టానం ఫోకస్ చేస్తుందా అనేది చూడాలి.
ఇది కూడా చదవండి..: TSRTC Union Elections | ఉమ్మడిజిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ ఎన్నికలు.. 60 శాతం పోలింగ్ పూర్తి