అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP BC Reservations | ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court)లో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్ల జీవోలను రద్దు చేస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను (SLP) సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
AP BC Reservations | కోర్టు వాదనలు ..
క్షేత్రస్థాయి జనాభా లెక్కలు, ఎంపిరికల్ డేటా ఆధారంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని, స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించారు. ఈ వాదనలపై విచారణ జరిపిన జస్టిస్ దీపాంక్ దత్తా, జస్టిస్ శీల్‌నాగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగబద్ధమైన 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ను దాటడానికి ఏమాత్రం వీలులేదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పిన ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లోనూ, స్థానిక ఎన్నికల ప్రక్రియలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
AP BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్..
మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటరు జాబితా తాజా రూపంలో సిద్ధమైనా.. లేక పాత జాబితాతో అయినా సరే స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది.
AP BC Reservations | సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు తగిన ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోలను జారీ చేసింది. అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 50 శాతం గరిష్ట పరిమితిని దాటుతున్నాయని ఆరోపిస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ధర్మాసనం.. 50 శాతం నిబంధనను ఉల్లంఘిస్తూ బీసీలకు 34 శాతం కోటా అమలు చేయడం కుదరదని స్పష్టం చేస్తూ ఆ రిజర్వేషన్ల జీవోలను రద్దు చేసింది. దీనిని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా చుక్కెదురైంది.
ఇది కూడా చదవండి..: AP Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్