TSRTC Union Elections | ఉమ్మడిజిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ ఎన్నికలు.. 60 శాతం పోలింగ్ పూర్తి

తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ నిజామాబాద్​, కామారెడ్డిలలో ప్రశాంతంగా జరుగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: TSRTC Union Elections | తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ నిజామాబాద్​, కామారెడ్డిలలో ప్రశాంతంగా జరుగుతోంది. గురువారం ఉదయం 5 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.

TSRTC Union Elections | కామారెడ్డి డిపో పరిధిలో..

కామారెడ్డి (Kamareddy) డిపో పరిధిలో మొత్తం 408 మంది కార్మికులకు ఓటు హక్కు ఉండగా, మధ్యాహ్నం వరకు దాదాపు 200 మంది ఓటు వేశారు. దాదాపు 50 శాతం పోలింగ్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. తెల్లవారుజామున విధులు ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీకి వెళ్లే ముందే ఓటు వేసి వెళ్లారు. దీంతో తొలి రెండు గంటల్లోనే భారీగా పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లిన సిబ్బంది తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రంలోపు ఓటు వేసే అవకాశం ఉందని యూనియన్ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు విధుల్లో ఉండి ఓటు వేయలేని కార్మికులకు బ్యాలెట్ ద్వారా 14, 15 తేదీలలో ఓటుహక్కు అవకాశం కల్పించినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో డిపో వద్ద సందడి నెలకొంది.

TSRTC Union Elections | నిజామాబాద్​ జిల్లాలో..

నిజామాబాద్​ జిల్లాలోని రెండు డిపోలలో ఉదయం 6 గంటల నుంచి పోలింగ్​ ప్రారంభమైంది. ఉమ్మడిజిల్లాలో డిపోలలో 1,864 ఓట్లు ఉన్నాయి. మధ్యాహ్నానికి డిపో–1లో 394 ఓట్లకు గాను 80శాతం ఓటింగ్​ జరిగింది. అలాగే న్యాల్​కల్​లోని ఉన్న డిపో–2లో మొత్తంగా 174 ఓట్లు ఉండగా 11 గంటల వరకు 96ఓట్లు పోలయ్యాయి.  ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

TSRTC Union Elections | మద్దతు కోసం ప్రచారం..

ఎంప్లాయీస్​ యూనియన్​, టీఎంయూ, ఎన్​ఎంయూ ఒక కూటమి కాగా.. టీడబ్ల్యూయూ, బీఎంఎస్​, టీజేఎంయూ మరో కూటమిగా నిలిచి గుర్తింపు కోసం పోరాడుతున్నాయి. వివిధ యూనియన్లకు చెందిన ప్రతినిధులు డిపో బయట చేరుకుని తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ కోసం డిపోలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటర్లు స్లిప్పులు తీసుకుని క్యూ లైన్లో నిలబడి ఓటు వేస్తున్నారు. నిజామాబాద్ రీజియన్ పరిధిలో మొత్తం 1,864 మంది ఓటర్లు ఉండగా, అన్ని డిపోల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఓటరు తప్ప మిగతా ఎవరినీ డిపో లోపలికి అనుమతించడం లేదు. కాగా పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో నువ్వా నేనా అన్నట్టుగా పోలింగ్ సాగుతోంది.

ఇది కూడా చదవండి..: Nizamabad Fire Accident | నగరంలో విషాదం.. అగ్నిప్రమాదంలో గాయపడ్డ తండ్రీకొడుకులు మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *