అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Formula E Case | సంచలనం సృష్టించిన ‘ఫార్ములా-ఈ కార్ రేసు’ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ( జులై 31 )నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న ఆయనకు న్యాయస్థానం రూ. లక్ష పూచీకత్తు, ఇద్దరు వ్యక్తులతో షూరిటీ సమర్పించాలని ఆదేశించింది. కేటీఆర్ (KTR)తో పాటు ఇతర నిందితులు అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి కూడా కోర్టులో పూచీకత్తు సమర్పించారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 25కి వాయిదా వేసింది.
KTR Formula E Case | ఏసీబీ ఛార్జ్‌షీట్..
నిబంధనలకు విరుద్ధంగా యూకేకు చెందిన ‘ఫార్ములా-ఈ ఆర్గనైజేషన్ (FEO)’కు నిధులు మళ్లించారనే ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు జరిపి, మార్చి 23న 77 పేజీల ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఇందులో 14 మంది సాక్షులను పేర్కొంటూ కేటీఆర్‌తో సహా ఐదుగురిపై అభియోగాలు మోపింది. కోర్టు ఈ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడంతో నిందితులు తొలిసారిగా నేడు కోర్టుకు హాజరయ్యారు. క్యాబినెట్, ఆర్థిక, న్యాయ శాఖల అనుమతులు లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, నిబంధనలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి హెచ్ఎండీఏ ద్వారా సుమారు రూ. 75.88 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారని ఏసీబీ అభియోగం మోపింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి నష్టం, ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరిందని, రాబోయే సీజన్లకు గాను ప్రభుత్వంపై రూ. 600 కోట్ల భారం పడేలా ఒప్పందాలు చేశారని పేర్కొంది.
KTR Formula E Case | కేటీఆర్ వాదన ..
ఇది వ్యక్తిగత నిర్ణయం కాదని, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి వేదికగా నిలపాలన్న ఉద్దేశ్యంతో అప్పటి ప్రభుత్వం సమిష్టిగా తీసుకున్న విధానపరమైన నిర్ణయమని కేటీఆర్ వాదించారు. అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను నేరాలుగా చిత్రీకరిస్తూ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కోర్టు విచారణకు ముందు కేటీఆర్ ఫేస్‌బుక్ వేదికగా స్పందిస్తూ.. “కుట్రపూరితంగా బనాయించిన ఈ తప్పుడు కేసులు ప్రజల తరఫున మేం చేసే పోరాటాన్ని ఆపలేవు. అంతిమంగా సత్యమే గెలుస్తుంది” అని పేర్కొన్నారు. కోర్టు ప్రక్రియ ముగిసిన తర్వాత, ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన నర్సంపేటకు బయలుదేరి వెళ్లారు.
ఇది కూడా చదవండి..: Rega Kantha Rao Case | పెళ్లి పేరుతో మోసం.. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు..?