Balkonda Healthcare | వైద్యారోగ్యానికి గ్రహణం.. బాల్కొండ ప్రజలపై నిర్లక్ష్యం

బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్ : Balkonda Healthcare | గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వ వైద్యారోగ్య రంగం బాల్కొండ నియోజకవర్గం (Balkonda Constituency)లో తీవ్ర అలసత్వానికి గురవుతోంది. నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల్లోనూ వైద్యాంగ సేవలు అరకొర వసతులతోనే సాగుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యారోగ్య అభివృద్ధి కోసం కొన్ని పనులు చేపట్టగా కొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ భవన నిర్మాణాల పనులు ముందుకు సాగట్లేదు.

పనులు ప్రారంభించిన కొన్ని ఆసుపత్రి భవనాలను నిధుల కొరతతో సగంలోనే వదిలేశారు. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ, ఆయా ఆగిపోయిన పనులను ముందుకు తీసుకెళ్లడంలో లేదా నూతన నిధులు కేటాయించడంలో ఆశించిన స్థాయిలో చొరవ చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Balkonda Healthcare | అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..?

గత ప్రభుత్వ హయాంలో భీమ్​గల్​ పట్టణంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన 100 పడకల ఏరియా ఆస్పత్రి నిర్మాణం అరకొర నిధులతో అసంపూర్తిగా మిగిలిపోయింది. బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపివేశారు. అలాగే భీమ్​గల్ పీహెచ్​సీని రాహత్ నగర్‌కు తరలించి నూతన భవనం నిర్మించడం, భీమ్​గల్​లో అర్బన్ పీహెచ్​సీని ఏర్పాటు చేయడం, మోర్తాడ్ మండలంలోని పాలెం లేదా తిమ్మాపూర్‌లో కొత్త పీహెచ్​సీని మంజూరు చేయడం వంటి అంశాలు గతంలో పంపిన ప్రతిపాదనల దశ దాటలేదు. నాటి ప్రభుత్వం ఆరంభించిన ఈ పనులు, ప్రతిపాదనలు ఇప్పటికీ కదలిక లేకుండా పోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా, బకాయి బిల్లులను విడుదల చేసి, ఆగిపోయిన పనులను వేగవంతం చేయడంలో తాత్సారం చేస్తోందనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

Balkonda Healthcare | కదలని దస్త్రాలు..

బాల్కొండ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనం శిథిలావస్థకు చేరినా నూతన భవన నిర్మాణానికి ఇంకా మోక్షం లభించలేదు. అత్యవసర సమయాల్లో శవపరీక్షల కోసం బాల్కొండ, మోర్తాడ్ మండలాల్లో కొత్తగా పోస్టుమార్టం భవనాలు నిర్మించాలనే ఆవశ్యకతను పాలకులు విస్మరిస్తున్నారు. గ్రామీణ స్థాయి ఆరోగ్య కేంద్రాలకు వెన్నుముక లాంటి 9 ఉపకేంద్రాల భవన నిర్మాణాలకు జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు రాక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రతిపాదించిన 18 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలకు నిధుల కేటాయింపు నిలిచిపోయింది. దీంతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్​లో కీలకమైన ఎంఆర్‌ఐ మెషిన్ సౌకర్యం లేకపోవడంతో, గ్రామీణ ప్రాంతాల పేద రోగులు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించి వేలకు వేలు వెచ్చించాల్సి వస్తోంది.

Balkonda Healthcare | ఎనిమిది మండలాల్లోనూ అరకొర సేవలే..

నియోజకవర్గంలోని 8 మండలాల పరిధిలో ఉచిత వైద్యం తీవ్ర ప్రతిబంధకాలను ఎదుర్కొంటోంది. బాల్కొండ, భీమ్​గల్​, మోర్తాడ్ మండలాల్లో ప్రధాన ఆస్పత్రి భవనాలు అసంపూర్తిగా ఉండటం, పోస్టుమార్టం సౌకర్యం లేకపోవడం పెను సమస్యగా మారింది. కమ్మర్‌పల్లి, వేల్పూర్ మండలాల్లో హెల్త్ సబ్‌సెంటర్ భవన నిర్మాణాలు నిధుల లేమితో సగంలోనే ఆగిపోగా, ఆయుష్మాన్ మందిరాల ఏర్పాటు ఊసే లేదు. ముప్కాల్, మెండోర మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత, రాత్రివేళల్లో వైద్యుల అందుబాటు లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన ఏర్గట్ల మండలంలో ఆరోగ్య కేంద్రానికి సొంత భవనం కూడా లేకపోవడం, పారామెడికల్ సిబ్బంది నియామకం జరగకపోవడం వైద్యాంగ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

Balkonda Healthcare | ప్రభుత్వం చొరవ చూపాలి

ప్రభుత్వం స్పందించి గ్రామీణులకు వైద్యం అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రతిపాదనలకే పరిమితమైన భవనాలకు వెంటనే పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో పాటు, సగంలో నిలిచిపోయిన భీమ్​గల్​ 100 పడకల ఆస్పత్రి, హెల్త్ సబ్‌సెంటర్ల బకాయి నిధులను తక్షణమే విడుదల చేయాల్సి ఉంది. అలాగే ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసి ఆగిపోయిన అభివృద్ధి పనులను పునరుద్ధరించి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Pocharam Project | పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్ట్​.. ఖరీఫ్​కు భరోసా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *