అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SI Suspended | అన్న అని పిలిచినందుకు నాయి బ్రాహ్మణుడిపై దాడి చేసిన ఎస్సైపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కరీంనగర్ (Karimnagar) త్రీ టౌన్ ఎస్సై చైతన్య చందర్ (SI Chaitanya Chander) శనివారం ఉదయం నగరంలోని ఖాన్‌పురా ప్రాంతంలోని న్యూ ప్రజా హెయిర్ స్టైల్ సెలూన్ కు వెళ్లాడు. ఆయనను చూడగానే షాపు యజమాని అన్న కూర్చో అన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్సై అతడిపై దాడి చేశారు. తనను అన్న అని పిలుస్తావా అంటూ చేయి చేసుకున్నాడు. ఈ ఘటన సెలూన్లోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితుడు ఎస్సైపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంటే ఎవరినైనా కొడతారా అంటూ మండిపడ్డారు.

SI Suspended | సీపీ సీరియస్
ఎస్సై చైతన్య చందర్ వ్యవహారం సీపీ గౌష్ ఆలం (CP Goush Alam) దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు. సామాన్య పౌరుడిపై దాడి చేయడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడం, విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది. దీంతో ఎస్సైపై సీపీ సీరియస్ అయ్యారు. అనంతరం అతడిని సస్పెండ్ చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దీనిని కూడా చదవండి : Telangana IAS Transfers | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకేసారి భారీ స్థాయిలో ఐఏఎస్ల బదిలీ!

