Harish Rao Remarks | నిరుద్యోగులపై ప్రభుత్వం కక్ష: హరీశ్​రావు

విద్యార్థులు, నిరుద్యోగులు అంటే ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష అని మాజీ మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Remarks | విద్యార్థులు, నిరుద్యోగులు అంటే ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష అని మాజీ మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్న కాంగ్రెస్​.. ఇప్పుడు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వస్తే వారి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అన్నారు.

హైడ్రాలో 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది నిరుద్యోగులు తరలి వచ్చారు. దీంతో సరూర్​ నగర్​ స్టేడియంలో తోపులాట చోటు చేసుకుంది. నిరుద్యోగులతో అధికారులు దురుసుగా ప్రవర్తించారు. దీనిపై ఎక్స్​ వేదికగా హరీశ్​రావు స్పందించారు. ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులను ముఖ్యమంత్రి “క్రిమినల్ వేస్ట్” అని అవమానించడం, ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం చూస్తుంటే “యథా రాజా.. తథా అధికారులు” అన్న సామెత గుర్తుకొస్తోందన్నారు.

Harish Rao Remarks | ఉద్యోగాల భర్తీ ఏమైంది

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని హరీశ్​రావు (Harish Rao) గుర్తు చేశారు. 32 నెలలు అవుతున్నా.. ఆ హామీ అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా భర్తీ చేసి ఉంటే.. ఈరోజు 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు ఇలా క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా అన్నారు. కాంగ్రెస్​ పాలనలో యువతలో నిరాశ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. నోటిఫికేషన్లు సక్రమంగా రాకపోవడంతో పీజీ, పీహెచ్​డీ చదివిన యువత కూడా చిన్నచిన్న పోస్టుల కోసం పోటీ పడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

Harish Rao Remarks

Harish Rao Remarks | వారిపై చర్యలు తీసుకోవాలి

ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగులను గౌరవించాలని ఆయన అన్నారు. నిరుద్యోగులపై అనుచితంగా, అసభ్యంగా మాట్లాడిన అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. వారిని అవమానించినందుకు విద్యార్థి, నిరుద్యోగలోకానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *