అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rent Boyfriend Scam | ప్రస్తుతం సమాజం వేగంగా మారుతోంది. యువత ఆధునిక, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad) నగరంలో కొత్త తరహా ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్ పేరిట పలువురు ఒంటరి యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. యాప్‌లు, సోషల్ మీడియాల్లో ప్రకటనలు ఇచ్చి.. మోసాలకు పాల్పడుతున్నారు.
ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో!”.. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉంది. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్ ఇది. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వేదికలుగా రెంట్ బాయ్‌ఫ్రెండ్ – యువర్ పర్సనల్ కంపానియన్ అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలతో కూడిన పోస్టర్లను నెట్టింట ప్రచారం చేస్తున్నారు.
Rent Boyfriend Scam | బుకింగ్స్ పేరిట బురిడీ
ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫోటోలు ప్రదర్శిస్తూ.. ఒక గంట కాఫీ మీటింగ్‌కు రూ.499, సినిమా డేట్‌కు రూ.1,249, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు రూ.1,999, అలాగే 10 గంటల ఫుల్ డే ప్యాకేజీకి రూ.4,499 అంటూ కేటుగాళ్లు ప్రచారం చేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా గోప్యత, భద్రత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరుతున్నారు. ఏఐతో సృష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ కుర్రాళ్ల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి, మెసేజ్ చేసిన అమ్మాయిలతో తియ్యటి మాటలతో సంభాషణలు మొదలు పెడుతున్నారు. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి, ఆపై అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారు.
Rent Boyfriend Scam | బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం
ఆన్‌లైన్ సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. చాటింగ్ క్రమంలో చాకచక్యంగా సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ రకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టిసారించిందన్నారు. ఈ విషయంలో అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Fire Accident | హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం