అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao Remarks | విద్యార్థులు, నిరుద్యోగులు అంటే ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వస్తే వారి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అన్నారు.
హైడ్రాలో 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది నిరుద్యోగులు తరలి వచ్చారు. దీంతో సరూర్ నగర్ స్టేడియంలో తోపులాట చోటు చేసుకుంది. నిరుద్యోగులతో అధికారులు దురుసుగా ప్రవర్తించారు. దీనిపై ఎక్స్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులను ముఖ్యమంత్రి “క్రిమినల్ వేస్ట్” అని అవమానించడం, ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం చూస్తుంటే “యథా రాజా.. తథా అధికారులు” అన్న సామెత గుర్తుకొస్తోందన్నారు.
Harish Rao Remarks | ఉద్యోగాల భర్తీ ఏమైంది
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని హరీశ్‌రావు (Harish Rao) గుర్తు చేశారు. 32 నెలలు అవుతున్నా.. ఆ హామీ అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా భర్తీ చేసి ఉంటే.. ఈరోజు 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు ఇలా క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా అన్నారు. కాంగ్రెస్ పాలనలో యువతలో నిరాశ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. నోటిఫికేషన్లు సక్రమంగా రాకపోవడంతో పీజీ, పీహెచ్డీ చదివిన యువత కూడా చిన్నచిన్న పోస్టుల కోసం పోటీ పడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

Harish Rao Remarks | వారిపై చర్యలు తీసుకోవాలి
ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగులను గౌరవించాలని ఆయన అన్నారు. నిరుద్యోగులపై అనుచితంగా, అసభ్యంగా మాట్లాడిన అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని అవమానించినందుకు విద్యార్థి, నిరుద్యోగలోకానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన