Dhoot Transmission IPO | ఐపీవోకు ఎలక్ట్రికల్ కంపెనీ.. 30 శాతం లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశం!

ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, వైరింగ్ హార్నెస్‌ల డిజైన్, తయారీ, పంపిణీలో అనుభవమున్న ధూత్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైంది. జీఎంపీ 30 శాతం వరకు ఉంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Dhoot Transmission IPO | ధూత్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ కంపెనీని 1998లో ప్రారంభించారు. ఇది ఆటోమోటివ్, నాన్ ఆటోమోటివ్ అప్లికేషన్స్ కోసం వైరింగ్ హార్నెస్ లు, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ డిజైన్ చేయడంతో పాటు ఇంజినీరింగ్, మ్యానిఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్‌లో అనుభవం కలిగి ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆటోమోటివ్ వైరింగ్ ఎక్విప్‌మెంట్ తయారు చేసే కంపెనీలకు మంచి డిమాండ్ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ధూత్ ట్రాన్స్‌మిషన్ ఐపీవోకు వచ్చింది.

Dhoot Transmission IPO | రూ. 3,066.89 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం..

మార్కెట్ నుంచి రూ. 3,066.89 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ధూత్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1,60,80,445 షేర్లను విక్రయించడం ద్వారా రూ. 1400 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1,91,37,602 షేర్లను అమ్మడం ద్వారా రూ. 1,667 కోట్లు సమీకరించనుంది. ఐపీవో (IPO) ద్వారా వచ్చిన ఆదాయాన్ని కొత్త మ్యానిఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం, కంపెనీ తీసుకున్న అప్పులను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడం కోసం, కంపెనీకి చెందిన అనుబంధ సంస్థలలో పెట్టుబడులు పెట్టడం కోసం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Dhoot Transmission IPO | ప్రైస్ బ్యాండ్ ..

కంపెనీ ప్రైస్ బ్యాండ్‌ను రూ. 829 నుంచి రూ. 871 లుగా కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్‌లో 17 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద కనీసం రూ. 14,807 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Dhoot Transmission IPO | కోటా, జీఎంపీ..

క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎనఐఐలకు 15 శాతం వాటాను కంపెనీ కేటాయించింది. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో ఈక్విటీ షేరుకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 259 లుగా ఉంది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ రోజు 30 లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ఐపీవో తేదీలు : ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 10న ప్రారంభమైంది. 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ ఈనెల 13వ తేదీ రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఆగస్టు 17న బీఎస్ ఈ, ఎన్ ఎస్ ఈలలో లిస్ట్ అవుతాయి.

ఇది కూడా చదవండి..: Aug 10 Market Analysis | లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *