JPSC Recruitment Scam | ఉద్యోగ నియామకాల కుంభకోణం.. జార్ఖండ్‌లో మాజీ చైర్మన్ అరెస్టు

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో రాష్ట్రంలో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: JPSC Recruitment Scam | జార్ఖండ్ ( Jharkhand )పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో రాష్ట్రంలో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. గత రెండు వారాలకు పైగా ఆందోళనలు చేస్తుండగా, సోమవారం ఈ నిరసనలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జితో పాటు వాటర్ గన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.

JPSC Recruitment Scam | మాజీ చైర్మన్ అరెస్ట్..

ఈ పరిణామాల వేళ ఈ కేసులో అత్యంత సంచలన పరిణామం చోటుచేసుకుంది. పరీక్షల నిర్వహణలో అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న జార్ఖండ్ సీఐడీ (CID) అధికారులు.. జేపీఎస్‌సీ మాజీ చైర్మన్ ఎల్ ఖియాంగ్తేను సోమవారం అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జార్ఖండ్ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ (ADG) మనోజ్ కౌశిక్ అధికారికంగా ధృవీకరించారు. నియామక పరీక్షల కుంభకోణానికి సంబంధించి సమగ్ర విచారణలో భాగంగానే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

JPSC Recruitment Scam | వివాదం నేపథ్యం ..

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (Chief Secretary) పనిచేసి రిటైర్ అయిన తర్వాత, ఖియాంగ్తే గత ఏడాది ఫిబ్రవరిలో జేపీఎస్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ సహా పలు ఉద్యోగ ప్రకటనల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు, విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. విచారణ నిష్పక్షపాతంగా సాగేందుకు వీలుగా ఆయన గతేడాది జులై 22నే తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో సీఐడీ ఇప్పటికే పలు కీలక సోదాలు నిర్వహించి పత్రాలు స్వాధీనం చేసుకోగా, తాజాగా మాజీ చైర్మన్‌ను అరెస్టు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో, నిరుద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఇది కూడా చదవండి: Jharkhand Assembly Protest | జార్ఖండ్​లో హైటెన్షన్​.. ఉద్రిక్తంగా మారిన అసెంబ్లీ ముట్టడి

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *