అక్షరటుడే, కామారెడ్డి : Student Suicides | పరీక్షల ఒత్తిడి, పోటీ, స్నేహితులతో పోలిక, ఇంట్లో అంచనాలు.. చిన్న విషయం కూడా పెద్ద సమస్యలా అనిపించే వయసులో ఉన్న విద్యార్థుల్లో ఆందోళన పెంచుతున్నాయి. ఆనందంగా చదువుకోవాల్సిన విద్యార్థులు ఒత్తిడికి (Academic Pressure) గురి అవుతున్నారు. ఫలితంగా క్షణికావేశానికి గురై తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మానసిక వేదనతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
Student Suicides | కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఆత్మహత్యకు పాల్పడటానికి వెతుకుతున్న కారణాలు తేలికపాటిగా కనిపిస్తున్నా అవి విద్యార్థులకు పెద్దవిగా కనిపిస్తున్నాయి. గడిచిన 15 రోజుల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యల బాట పట్టడం కలకలం రేపుతున్నాయి. పాఠశాల స్థాయి, ఇంటర్ చదువుతున్న కొందరు విద్యార్థులు మార్కులు తక్కువ రావడం, స్నేహితులతో విభేదాలు, ఇంట్లో మందలింపు వంటి కారణాలతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది పిల్లలు తమ మానసిక ఒత్తిడిని ఎవరితోనూ పంచుకోవడం లేదు. ఎవరితోనూ చర్చించకుండా ఆత్మహత్యల బాట పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో కౌన్సెలింగ్ సౌకర్యాలు ఉన్నా వాటిని వినియోగించే వారి సంఖ్య తక్కువగా ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
Student Suicides | కాపాడిన కుటుంబ సభ్యులు
జిల్లాలో గత 15 రోజుల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు ఇంటర్, మరొక ఇద్దరు తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులు సమయానికి గుర్తించడంతో ముగ్గురికి ప్రాణాపాయం తప్పిగా ఒక విద్యార్థి ప్రాణం బలైంది. పిల్లల ప్రవర్తనలో మార్పులపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుపై ఒత్తిడితో పిల్లలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని కొంతమంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. చిన్నపాటి విషయానికి ఆత్మహత్యాయత్నం నిర్ణయాలు తీసుకోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలను ఏమి అంటే ఎలా స్పందిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
Student Suicides | ఇటీవల జరిగిన ఘటనలు
పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి జశ్వంత్ చదువులో వెనుకబడి ఉన్నానని ఆగస్ట్ 9న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గాంధారి మండలం గుర్జాల్ గ్రామంలో పండగకు వచ్చిన అక్కతో గొడవపడి మనస్తాపానికి గురైన 9 వ తరగతి చదివే బాలిక ఆగస్ట్ 13న గడ్డి మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణపాయం తప్పింది. నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన సాయితేజ కామారెడ్డి ఇందిరానగర్ కాలనిలో హాస్టల్ లో ఉండి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువు ఇష్టంలేక కొత్త బస్టాండ్ వద్ద ఈ నెల 14న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా స్థానికులు గమనించి హాస్పిటల్‌కు తరలించారు. రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి సంతోష్‌ను ఫోన్ ఎక్కువగా వాడవద్దని మందలించినందుకు ఈ నెల 14న ఆత్మహత్యాయత్నం చేశాడు.
తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి..
– జి రమణ, న్యూరో సైకియాట్రిస్ట్
టీనేజి పిల్లల నిర్ణయాలు అనాలోచితంగా ఉంటాయి. ఇంటి సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, తోటి విద్యార్థులతో చదువు, ఇతర అంశాలపై పోల్చుకోవడంపై భిన్న పరిస్థితులు ఉంటాయి. ఈ వయసులో వారి బ్రెయిన్ ఎదుగుదల కూడా తక్కువగా ఉంటుంది. దాంతో ఎక్కువగా ఆలోచించి ఆత్మహత్య బాట పట్టే అవకాశాలుంటాయి. వాటి దృష్టి మళ్లించేందుకు తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. వీలైనంత ఎక్కువ సేపు వారితో గడిపి పలు విషయాలపై చర్చించాలి. అప్పుడే పిల్లల్లో ఆత్మహత్య ధోరణి ఆలోచన రాకుండా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Ashish Banerjee Suicide | రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశా.. సూసైడ్ నోట్లో టీఎంసీ మాజీ ఎమ్మెల్యే