BC Caste Census | కులగణనతోనే బీసీల సమగ్ర అభివృద్ధి సాధ్యం: ప్రభుత్వ సలహాదారు వి.హన్మంత్ రావు

కులగణన నిర్వహిస్తేనే బీసీల సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు అన్నారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, కామారెడ్డి: BC Caste Census | కులగణన నిర్వహిస్తేనే బీసీల సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ సలహాదారు వి. హన్మంత్​ రావు(V Hanumantha Rao) అన్నారు. కామారెడ్డి( Kamareddy) కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

BC Caste Census | సామాజిక న్యాయం.. సమానత్వం..

సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. దేశ జనాభాలో బీసీల వాటా గణనీయంగా ఉన్నప్పటికీ రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ఎంత ఉంటే ఆ మేరకు అవకాశాలు, ప్రాతినిథ్యం కల్పించాలన్నదే కాంగ్రెస్ డిమాండ్ అని స్పష్టం చేశారు. జనగణనతో పాటు సమగ్ర కులగణన చేపట్టి ప్రతి సామాజిక వర్గం జనాభా, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగాలు, పథకాల ప్రయోజనాలపై సమాచారం సేకరించాలని కోరారు. కులగణన ఆధారంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి న్యాయం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో బీసీలకు సంబంధించిన కుల వివరాలను స్పష్టంగా ఎందుకు పొందుపరచడం లేదని ప్రశ్నించారు.

BC Caste Census | జనాభా లెక్కలు తేలిన తర్వాతే..

కులగణన లేకుండా బీసీలకు ఎంత న్యాయం జరుగుతుందో ఎలా నిర్ణయిస్తారని, జనాభా లెక్కలు తేల్చకుండా వారికి సరైన వాటా ఎలా కల్పిస్తారని కేంద్రాన్ని హన్మంత్​ రావు నిలదీశారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ అంశాలను ముందుకు తీసుకెళ్లారని, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆయన పార్లమెంట్‌లో నిరంతరం ప్రశ్నిస్తున్నారని తెలిపారు. పార్లమెంట్‌లో బీసీలకు న్యాయం చేసేందుకు ప్రత్యేక చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, పేదలకు సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన స్వాతంత్య్రానికి అర్థమన్నారు. బీసీలకు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే శాశ్వత విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్య, ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం, స్వయం ఉపాధికి తక్కువ వడ్డీ రుణాలు, చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహకారం, వృత్తిదారులకు ఆధునిక పరికరాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని కోరారు.

BC Caste Census | బీసీ యువతకు నైపుణ్య శిక్షణ..

బీసీ యువతకు నైపుణ్య శిక్షణ, పోటీ పరీక్షల కోచింగ్, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు, వెనుకబడిన కుటుంబాలకు గృహ, విద్య, ఆరోగ్య సదుపాయాలు అవసరమని పేర్కొన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూడకుండా వారి అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సామాజిక న్యాయం కోసం కులగణన సాధించే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కులగణనతోనే బీసీల వాస్తవ జనాభా తెలుస్తుందని, జనాభా ప్రాతిపదికన వాటా దక్కితేనే సంపూర్ణ న్యాయం జరుగుతుందని వి. హనుమంతరావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి, పండ్ల రాజు, గోనె శ్రీనివాస్, గూడెం శ్రీనివాస్, భూమని బాలరాజ్, సాయిలు, చాట్ల రాజేశ్వర్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *