అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Development | కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని బీసీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు వి. హన్మంత్ రావు అన్నారు. రైతు సంక్షేమం నుంచి విద్య, వైద్యం వరకు ప్రతి వర్గానికి ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని పేర్కొన్నారు.
కామారెడ్డి (Kamareddy) ఇందిరాగాంధీ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హన్మంత్ రావుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర స్వాగతం పలికారు. జెండావిష్కరణ చేసిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 4.12 లక్షల 822 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.వ్యవసాయానికి 1.18 లక్షల 827 మంది రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తుండగా ఈ ఏడాది అదనంగా 924 కొత్త కనెక్షన్లకు మంజూరు చేశామని చెప్పారు.
Kamareddy Development | మహిళల కోసం..
మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని వీహెచ్ అన్నారు. కొత్తగా చేయూత పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 7.51 లక్షల మంది మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామని, స్వయం సహాయక సంఘాలకు రూ.200 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు కల్పించామని పేర్కొన్నారు. విద్యార్థులకు యూనిఫాంలు, నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద గత ఏడాది జిల్లాలో 18,369 మందికి రూ.50.56 కోట్లు, ఈ ఏడాది 5,691 మందికి రూ.16.51 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ “అరైవ్ అలైవ్”, “ఆపరేషన్ కవచ్” కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
వనమహోత్సవంలో భాగంగా 11.25 లక్షల మొక్కలు నాటినట్లు వివరించారు. అనంతరం వివిధ శాఖలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆయన పరిశీలించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినపలువురు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Two Cars Collide | ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ : ఇద్దరికి తీవ్ర గాయాలు..