అక్షరటుడే, కామారెడ్డి: Badi Bata 2026 | ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే గతంలో అనేక విధాలుగా ఆలోచించేవారు. సరైన వసతులు లేవని, ఉపాధ్యాయులు ఉండరని సాకులు వెతికేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి పోయింది. ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అందుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు కూడా ప్రైవేటుకు ధీటుగా వస్తున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగింది. జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేసిన కృషి ఫలితంగా బడిబాట-2026 నమోదులో కామారెడ్డి జిల్లా (Kamareddy District) రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుకోవడం, అందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడమే ఈ స్థానం వచ్చిందనడంలో సందేహమే లేదు.
Badi Bata 2026 | 478 మంది అదనపు చేరికలు
ఈ నెల 8 వరకు యూడైస్ పోర్టల్ ప్రకారం జిల్లాలో మొత్తం 81,807 మంది విద్యార్థులు నమోదు కాగా, గత విద్యా సంవత్సరం 81,329తో పోలిస్తే 478 మంది అదనంగా ప్రభుత్వ బడుల్లో చేరారు. జూన్ 15 నుంచి ఇప్పటివరకు 17,132 మంది కొత్త విద్యార్థులు ప్రవేశాలు పొందారు. గతేడాది నమోదును దాటిన జిల్లాల జాబితాలో కామారెడ్డి 4వ స్థానంలో నిలిచింది.
Badi Bata 2026 | కేజీవీబీ.. ప్రీ-ప్రైమరీలోనూ పురోగతి
కస్తూర్బా పాఠశాలల్లోనూ విద్యార్థుల నమోదు గతంలో కంటే పెరిగింది. గతేడాది 5,538 మంది ఉండగా, ఈసారి 5,789 మంది చేరారు. 10శాతం అదనపు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా 91 ప్రవేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జిల్లాలోని 166 ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో లక్ష్యం 2,490 కాగా, ప్రస్తుతం 2,374 మంది పిల్లలు నమోదయ్యారు. లక్ష్య సాధనకు మరో 116 మంది విద్యార్థులు మాత్రమే అవసరం ఉన్నారు.
Badi Bata 2026 | ప్రభుత్వ బడుల వైపు మొగ్గు
గతంలో కంటే ప్రభుత్వ విద్యపై నమ్మకానికి ఇదే పెద్ద నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది 4,031 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారారు. ఈ విభాగంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో 3వ స్థానం సాధించింది. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ప్రైవేట్‌కు వెళ్లిన వారు కేవలం 229 మంది మాత్రమే ఉండడం విశేషం. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంఖ్య మరిన్ని రోజుల్లో పెరగనుండగా ప్రైవేటులో భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
Badi Bata 2026 | హాజరులోనూ రాష్ట్రంలో 2వ స్థానం
గతంలో పాఠశాలలకు డుమ్మాలు అధికంగా ఉండేవి. వివిధ పనుల నిమిత్తం ఉపాధ్యాయులు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎఫ్ఆర్ఎస్ స్టాఫ్ హాజరు నమోదులో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. విద్యార్థుల హాజరులోనూ అదే స్థానం దక్కించుకోవడం జిల్లా విద్యాశాఖ సమిష్టి కృషికి నిదర్శనంగా నిలిచింది.
Badi Bata 2026 | లక్ష్యం సాధించిన అధికారులు, ఉపాధ్యాయులు
జిల్లాలో మండల వైద్యాధికారులు 10 శాతం అదనపు ప్రవేశాల లక్ష్యాన్ని ఇప్పటికే సాధించారు. ఈ కేటగిరీలో మాచారెడ్డి ఎంఈఓ సురభి దేవేందర్ రావు, తాడ్వాయి ఎంఈఓ రామస్వామి ఉన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేసిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల జాబితాలో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ జిల్లా పరిషత్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు సంగారెడ్డి, సదాశివనగర్ మండలం కల్వారాల కాంప్లెక్స్ ప్రదాన్యోపాధ్యాయుడు విష్ణువర్ధన్, మాచారెడ్డి మండలం చుక్కాపూర్ జిల్లా పరిషత్ కాంప్లెక్స్ ప్రదాన్యోపాధ్యాయుడు దేవేందర్ రావు ఉన్నారు.
Badi Bata 2026 | అధికారులకు అభినందనలు
– మల్లికార్జున్, డీఈఓ, కామారెడ్డి
బడిబాట విజయానికి అధికారుల సహకారం మర్చిపోలేనిది. సహకరించిన అడిషనల్ కలెక్టర్, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్.ఎంలు, ప్రధానోపాధ్యాయులు, ఎంఐస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, సీఆర్పీలకు అభినందలు తెలుపుతున్నాను.
Badi Bata 2026 | ప్రతిఒక్కరూ బడిలో చేరేవరకు పని చేయాలి
– ఆశిష్ సంగ్వాన్, కలెక్టర్ కామారెడ్డి
జిల్లాలోని ప్రతి అర్హత కలిగిన బాలబాలిక ప్రభుత్వ పాఠశాలలో చేరే వరకు ఇదే ఉత్సాహంతో పని చేయాలి. నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలతో తల్లిదండ్రుల్లో మరింత విశ్వాసం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం విద్యాశాఖ సిబ్బంది, ఇతర అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి. తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు రావాలి.
ఇది కూడా చదవండి..: LIC Retired Employee | రూ.3.5 కోట్లతో ఎల్ఐసీ రిటైర్డ్ ఉద్యోగి పరార్.. ఆందోళనలో ఏజెంట్లు