అక్షరటుడే, కామారెడ్డి: SIR Gram Sabhas | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గురువారం సభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ప్రతిమా సింగ్ (Pratima Singh) పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
SIR Gram Sabhas | ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా..
ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, లోపాలు లేకుండా పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ గ్రామ సభలను నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జి కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను బహిరంగంగా చదివి వినిపించడంతో పాటు జాబితాలోని వివరాలను ప్రజలకు తెలియజేస్తారన్నారు. అలాగే మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, నివాసం మారిన ఓటర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటర్లు, గైర్హాజరైన ఓటర్ల జాబితాలను కూడా చదివి వినిపిస్తారని కలెక్టర్ తెలిపారు.
ప్రతి ఓటరు తప్పనిసరిగా గ్రామ సభకు హాజరై ఓటరు జాబితాను పరిశీలించాలని, తమ పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నా, పేరు తొలగింపుపై అభ్యంతరాలు ఉన్నా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ గ్రామ సభల్లో బూత్ స్థాయి అధికారులు, పర్యవేక్షకులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొని నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ, అభ్యంతరాల నమోదు, పరిష్కార విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని ఆమె వివరించారు.
ఇది కూడా చదవండి..: Khelo India Youth Games | ఖేలో ఇండియా యువజన క్రీడల వేదికగా ఖేల్ భారతి ఇండోర్ స్టేడియం