Sugar Prices | పండగ వేళ ధరల సెగలు.. చక్కెర కొనుగోళ్లపై పరిమిత ఆంక్షలు!

పండగల సీజన్ వస్తోందంటే ఇళ్లన్నీ పిండివంటల ఘుమఘుమలతో సందడిగా మారుతుంటాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Sugar Prices | పండగల సీజన్ వస్తోందంటే ఇళ్లన్నీ పిండివంటల ఘుమఘుమలతో సందడిగా మారుతుంటాయి. తీపి పదార్థాలు పంచుకుంటూ ఆనందంగా గడుపుతారు. కానీ, ఈసారి మాత్రం పండగ తీపికి ధరల సెగ గట్టిగా తగులుతోంది. దేశంలో చక్కెర ధరలు వేగంగా పెరుగుతుండటంతో సామాన్య గృహిణులు, మిఠాయిల తయారీదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Sugar Prices | కొనుగోళ్లపై కఠిన నిబంధనలు..

ఒకవైపు జేబులు ఖాళీ అవుతుంటే, మరోవైపు కావాల్సినంత చక్కెర దొరకక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం చక్కెర కొనుగోళ్లపై స్పష్టమైన కోతలు కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినా, నేరుగా సూపర్‌మార్కెట్‌కు వెళ్లినా పరిమితులకే పరిమితం కావాల్సి వస్తోంది. బ్లింకిట్, జెప్టో ( Zepto ) , స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ప్రముఖ యాప్‌లు ఒక్కో ఆర్డర్‌కు కేవలం రెండు కేజీల ప్యాకెట్లకు మాత్రమే అనుమతిస్తున్నాయి. కొన్ని చోట్ల కొన్ని బ్రాండ్లు అందుబాటులో లేక “స్టాక్ లేదు” అని చూపిస్తున్నాయి. డి-మార్ట్, రిలయన్స్ వంటి పెద్ద రిటైల్ చైన్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఒక్కో కస్టమర్‌కు 2 నుంచి 3 కేజీలకు మించి చక్కెర ఇవ్వడం లేదు.

కృత్రిమ కొరతను సృష్టించకుండా, వ్యాపారులు హోల్‌సేల్‌గా సరుకును దాచిపెట్టకుండా ఉండటానికే రిటైలర్లు ఈ నిబంధనలు తెచ్చారు. రోజువారీ అవసరాలకు కొనేవారికి ఇది పెద్దగా అనిపించకపోయినా, పండగ కోసం భారీగా పిండివంటలు చేసే కుటుంబాలకు, స్వీట్ షాపులకు ఇది పెద్ద సమస్యగా మారింది.

Sugar Prices  | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో చక్కెర లభ్యతను పెంచడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రావణ మాసం, వినాయక చవితి, దసరా, దీపావళి వరుస పండగల వేళ సుమారు 10 లక్షల టన్నుల రా-షుగర్ (ముడి చక్కెర)ను ఎలాంటి సుంకం (డ్యూటీ ఫ్రీ) లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Sugar Prices  | రెండు నెలల సమయం ..

ముందుగా ఈ ప్రాసెసింగ్‌కు అక్టోబర్ 31 వరకు మాత్రమే గడువు ఉండగా, తాజాగా దాన్ని సవరించారు. దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను రిఫైన్ చేసి మార్కెట్‌లోకి వదలడానికి వ్యాపారులకు ‘బిల్ ఆఫ్ ఎంట్రీ’ సమర్పించిన నాటి నుంచి రెండు నెలల సమయం కల్పించారు. దీనివల్ల రిఫైనరీలకు కాస్త ఊరట లభించడమే కాకుండా మార్కెట్‌లోకి క్రమంగా సరుకు రానుంది.

అయితే, ఈ ప్రభుత్వ నిర్ణయాల ఫలితాలు క్షేత్రస్థాయికి చేరడానికి, దిగుమతి అయిన చక్కెర రిఫైన్ అయి మార్కెట్‌లోకి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపు పండగ డిమాండ్ తారాస్థాయికి చేరితే పరిస్థితి ఎలా ఉంటుందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంత త్వరగా ధరలను అణచివేస్తాయో, కొనుగోలు పరిమితులను ఎత్తివేస్తాయో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Banswada Road Accident | ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *