అక్షరటుడే వెబ్‌డెస్క్: MPSC Exam Protest | మహారాష్ట్ర ( Maharashtra )పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలు, తప్పులపై నిరుద్యోగులు చేపడుతున్న ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మహారాష్ట్ర అభ్యర్థులకు పార్టీ అండగా ఉంటుందని, పుణేలో సోమవారం జరగనున్న భారీ నిరసన ప్రదర్శనకు సంఘీభావం తెలుపుతున్నట్లు ఆ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ‘ఎక్స్’ (X) వేదికగా వెల్లడించారు. MPSC పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసనలో భాగంగా పుణేలోని ఓంకారేశ్వర్ మందిర్ చౌక్ నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ‘విద్యార్థి ఆక్రోశ్ మోర్చా’ పేరిట భారీ ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
MPSC Exam Protest | విద్యార్థుల డిమాండ్..
MPSC అధ్యక్షుడు, కార్యదర్శి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని, వారి స్థానంలో నీతి, నిజాయితీ, బాధ్యత గల అధికారులను నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అలాగే గ్రూప్-బీ పరీక్షలోని అభ్యంతరాలపై 8 రోజుల్లోగా స్పష్టతనిచ్చి, జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. రాజ్యసేవ మెయిన్స్ 2025, వ్యవసాయ సేవల పరీక్షల డిస్క్రిప్టివ్ పేపర్ల మూల్యాంకనంలో దొర్లిన పొరపాట్లపై తక్షణమే విచారణ చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ MPSCకి సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదికను వెంటనే బహిరంగపరచాలని, అరెస్టయిన నిందితుడు, అండర్ సెక్రటరీ అభిజీత్ లెండే పదవీకాలంలో నిర్వహించిన అన్ని పరీక్షలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని పేర్కొన్నారు.
MPSC Exam Protest | సర్వీస్ కాలంపై దర్యాప్తు..
నిందితులు లెండే, మరాఠే, నఖాతేల సర్వీస్ కాలం, వారి పదోన్నతుల ప్రమాణాలపై లోతైన దర్యాప్తు చేపట్టాలని అభిజిత్ దీప్కే కోరారు. ఈ ముగ్గురు నిందితుల కాంటాక్ట్‌ల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల కాల్ డేటా రికార్డ్స్ (CDR) పరిశీలించాలని సూచించారు. ప్రవీణ్ పాటిల్, మయూర్ ఠాక్రేలతో పాటు ఈ కుంభకోణంలో ఇతర ఏజెంట్ల ప్రమేయంపై కూడా సమగ్ర విచారణ జరగాలన్నారు.
MPSC Exam Protest | భవిష్యత్ పరీక్షలపై స్పష్టత..
ఇతర పరీక్షల ఫలితాలపై అభ్యర్థులకు ఉన్న అనుమానాలను పరిగణనలోకి తీసుకుని స్వతంత్ర విచారణ జరిపించాలన్నారు. ‘DI’ విభాగంలోని అనుమానాస్పద ఫలితాలు, ఉత్తీర్ణత సాధించిన వారిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 25, 2026న జరగబోయే గ్రూప్-సి ప్రిలిమ్స్ పరీక్షను ఎలాంటి లోపాలకు తావు లేకుండా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, స్టెనోగ్రాఫర్ పోస్టును తక్షణమే పునరుద్ధరించాలని అభిజిత్ దీప్కే కోరారు.
ఇది కూడా చదవండి: Delhi Hostel Collapse | ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్.. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులు