PCB Price Hike | యుద్ధం ఎఫెక్ట్.. 40 శాతం పెరిగిన సర్క్యూట్ బోర్డుల ధరలు!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: PCB Price Hike | పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టనున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగంపై తీవ్రంగా పడింది. గ్యాడ్జెట్ల తయారీలో అత్యంత కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల (Printed Circuit Boards) ధరలు ఏకంగా 40 శాతం మేర పెరగడమే దీనికి ప్రధాన కారణం.

PCB Price Hike | ముడిపదార్థం ఉత్పత్తి :

ఏప్రిల్ మొదటి వారంలో సౌదీ అరేబియాలోని జుబైల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌పై జరిగిన దాడి ఈ సంక్షోభానికి దారితీసింది. పీసీబీ లామినేట్స్ తయారీకి అవసరమైన ‘పాలీఫెనిలిన్ ఈథర్’ (PPE) అనే ముడిపదార్థం ఉత్పత్తి ఇక్కడ నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్త సరఫరాలో దాదాపు 70 శాతం వాటా ఈ కేంద్రానిదే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ యూనిట్‌లో పనులు పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపించకపోవడంతో పీపీఈ కొరత తీవ్రమైంది.

PCB Price Hike | గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక ప్రకారం:

ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) సర్వర్ల వల్ల పీసీబీలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. తాజా పరిణామాలతో వీటి ధరలు మరింత భారంగా మారాయి. గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక ప్రకారం.. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో వీటి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీనివల్ల రానున్న రోజుల్లో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఏఐ ఆధారిత సేవలు కూడా సామాన్యులకు భారం కానున్నాయి.

PCB Price Hike | పీసీబీ మార్కెట్ విలువ:

ఈ ఏడాది ప్రపంచ పీసీబీ మార్కెట్ విలువ (PCB Market Value) సుమారు 95.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సాధారణ మల్టీలేయర్ పీసీబీ ధర దాదాపు 204 డాలర్లుగా ఉండగా, హై-ఎండ్ ఏఐ సర్వర్లకు వాడే బోర్డుల ధరలు వేల డాలర్లలో పలుకుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Indo-Pacific Tension | యుద్ధం అమెరికాది.. లాభం చైనాది.. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో కొత్త టెన్షన్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *