అక్షరటుడే, వెబ్‌డెస్క్: Microsoft Voluntary Exit Offer | టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగులను తగ్గించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా లేఆఫ్‌లకు బదులుగా వలంటరీ ఎగ్జిట్ ఆఫర్(వీఈవో) ను తీసుకువచ్చింది. భారత్‌తో సహా 4 దేశాల్లోని 60వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ అవకాశాన్ని ప్రకటించినట్లు పేర్కొంది. ఇది కంపెనీ ఉద్యోగులలో దాదాపు 27 శాతానికి సమానం. 2026 జూన్ నాటికి కంపెనీలో పూర్తికాల ఉద్యోగుల సంఖ్య 2.23 లక్షలు. ఇందులో 1.21 లక్షల మంది యూఎస్‌లో పనిచేస్తుండగా.. మిగిలినవారు వివిధ దేశాలలోని కార్యాలయాలలో సేవలందిస్తున్నారు.
Microsoft Voluntary Exit Offer | నాలుగు దేశాల్లో వీఈవో..
భారత్ (India)తోపాటు కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌లోని ఎక్స్‌బాక్స్, విండోస్, కోపైలట్ మరియు ఫైనాన్స్ వంటి విభాగాలలోని ఉద్యోగులలో లెవల్ 70 మరియు అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారు వీఈవోలో పాల్గొనడానికి అర్హులు. సేల్స్, మార్కెటింగ్, సెక్యూరిటీతోపాటు కొన్ని నిర్దిష్ట ఇంజినీరింగ్ విభాగాలు ఇందులో భాగం కావు.
Microsoft Voluntary Exit Offer | భారత్‌లో మొత్తం 23 వేల మంది ఉద్యోగులు..
భారత్‌లో మైక్రోసాఫ్ట్‌కు 23 వేల మంది ఉద్యోగులున్నారు. ఎక్కువమంది టెక్నాలజీ, ఇంజినీరింగ్, కార్పొరేట్ సపోర్ట్ విభాగాల్లో పనిస్తున్నారు. కోపైలట్, ఏఐ, క్లౌడ్ వంటి విభాగాల సిబ్బంది ఇక్కడ కూడా ఉన్నారు. వీరిలో ఎంతమందికి వీఈవో వర్తిస్తుందన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భారత్‌లో బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, న్యూదిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణె, ముంబయి, నోయిడాలో మైక్రోసాఫ్ట్ కార్యాలయాలున్నాయి. కాగా మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం ఉన్న రెడ్‌మండ్ క్యాంపస్ తర్వాత హైదరాబాద్ క్యాంపసే అతిపెద్ద ఇంజినీరింగ్ హబ్ కావడం గమనార్హం. ఇక్కడ 10వేల మందికిపైగా ఉద్యోగులున్నారు.
Microsoft Voluntary Exit Offer | స్వచ్ఛందమే అంటున్న కంపెనీ..
తాజా ఆఫర్‌ను అంగీకరించి వెళ్లే ఉద్యోగులకు కంపెనీ స్టాండర్డ్ సెవరెన్స్ రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీని ప్రకారం ఉద్యోగులు మరో ఉపాధిని ప్లాన్ చేసుకోవడానికి, కొత్త ఉద్యోగం వెతుక్కునే క్రమంలో కంపెనీ అవసరమైన వనరులను సమకూర్చుతుంది. అర్హత ఉన్న ఉద్యోగులు వైదొలగాలా వద్దా అని వారే ఎంచుకోవచ్చని, ఆఫర్ అంగీకరించిన వారికి ఆర్థిక సహాయం మరియు కెరీర్ ప్లానింగ్ వనరులు లభిస్తాయని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
Microsoft Voluntary Exit Offer | ఉద్యోగాల తీసివేతకు ప్రత్యామ్నాయంగా..
స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్ అంటే ఉద్యోగ తొలగింపు కాదు. దీనిని అంగీకరించి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్న ఉద్యోగులకు ఈ ఆఫర్ మద్దతును అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ బ్లాగ్‌పోస్ట్ దీనిని కాలపరిమితి గల ఆఫర్‌గా పేర్కొంది. కంపెనీ నేరుగా ఉద్యోగులను తీసేయడానికి బదులుగా భవిష్యత్‌లో కొత్త కెరీర్ మార్గాలను వెతుక్కోవాలనుకునేవారికి గౌరవప్రదమైన నిష్క్రమణ మార్గాన్ని కల్పించాలని ఈ ప్లాన్‌ను ప్రతిపాదించినట్లు చెబుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై భారీ పెట్టుబడులు, కంపెనీ ప్రాధాన్యతలకు తగ్గట్టుగా ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ లక్ష్యంగా ఈ ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు ప్రకటించింది.
ఇది కూడా చదవండి..: Theni sub jail prisoners escape | సబ్‌జైలు సిబ్బందిపై దాడి చేసి.. 17 మంది ఖైదీలు పరారీ.. తమిళనాడులో ఘటన