అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Ganesh Utsav Peaceful Celebrations | గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
Ganesh Utsav Peaceful Celebrations | అధికారులకు కీలక సూచనలు
సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya), అదనపు కలెక్టర్ భుజంగరావు సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. గణేష్ ఉత్సవాలు, జెండా బాలాజీ జాతర సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో, భక్తి శ్రద్ధలతో మతసామరస్యానికి ప్రతీకగా వేడుకలు జరిగేలా కృషి చేస్తామని అన్నారు.
Ganesh Utsav Peaceful Celebrations | రోడ్ల మరమ్మతులు
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరు కూడా విద్యుదాఘాతం బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
Ganesh Utsav Peaceful Celebrations | ట్రాఫిక్కు అంతరాయం లేకుండా..
ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా వినాయక మండపాలు ప్రతిష్టించాలని సూచించారు. ఎనిమిది అడుగుల కంటే తక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలను మాత్రమే బాసర గోదావరిలో నిమజ్జనానికి అనుమతిస్తామని, అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ఉమ్మెడ వద్ద నిమజ్జనం చేయాలని సూచించారు. భారీ శబ్దాల వల్ల చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున మండపాల వద్ద డీజే సౌండ్లను నిషేధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు.
Ganesh Utsav Peaceful Celebrations | మద్యం విక్రయాలపై ఆంక్షలు..
గణేష్ ఉత్సవాలు, జెండా బాలాజీ వేడుకల సందర్భంగా నిర్ణీత రోజుల్లో మద్యం విక్రయాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని అవగాహన కల్పిస్తూ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. మేయర్ ఉమారాణి, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి, ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Tata Madhu Resignation | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే రాజీనామా చేయాలి