iPhone 18 Series | రేపే యాపిల్ మెగా ఈవెంట్.. ఫోల్డబుల్ ఐఫోన్‌పై భారీ అంచనాలు

మెమరీతో పాటు ఇతర కాంపోనెంట్ల ధరలు పెరగడం, సరఫరా వ్యయాలు అధికం కావడం వంటి కారణాలతో కొత్త ప్రీమియం డివైజ్‌ల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: iPhone 18 Series | టెక్ దిగ్గజం యాపిల్‌ Apple ప్రతిష్ఠాత్మక ప్రొడక్ట్‌ లాంచ్‌ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. అమెరికాలోని కుపెర్టినోలో ఉన్న యాపిల్ పార్క్‌లో సెప్టెంబర్ 9న ‘Surprise and Shine’ పేరుతో ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ ఏడాది ఈవెంట్‌పై టెక్‌ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా యాపిల్‌ తొలిసారి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను పరిచయం చేయనుందన్న అంచనాలు హాట్‌టాపిక్‌గా మారాయి.

iPhone 18 Series | ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌పై ఫోకస్

ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ మోడళ్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం.. ఈసారి సెప్టెంబరు ఈవెంట్‌లో సాధారణ ఐఫోన్ 18ను కాకుండా ప్రీమియం ప్రో మోడళ్లకే యాపిల్‌ ప్రాధాన్యం ఇవ్వవచ్చని తెలుస్తోంది. బేస్‌ ఐఫోన్ 18 విడుదల 2027 వరకు వాయిదా పడే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

iPhone 18 Series | ఫోల్డబుల్ ఐఫోన్.. ఇదే ప్రధాన ఆకర్షణ?

ఈసారి ఈవెంట్‌లో అత్యంత ఆసక్తి రేపుతున్నది యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్. దీనిని ‘iPhone Ultra’ లేదా ‘iPhone Fold’ పేర్లతో పిలిచే అవకాశం ఉందని సమాచారం.

పాస్‌పోర్ట్‌ తరహా ఫోల్డింగ్‌ డిజైన్‌, పెద్ద ఇంటర్నల్‌ డిస్‌ప్లే, బలమైన హింజ్‌, స్క్రీన్‌పై మడత గుర్తు తక్కువగా కనిపించేలా చేసే డిజైన్‌పై యాపిల్‌ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Zee Entertainment Downfall Story | జీ ఎంటర్టైన్మెంట్ సంక్షోభం..సుభాష్ చంద్ర ‘జీ’ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది?

ఈ ఫోన్‌ అత్యంత ప్రీమియం ధర విభాగంలో ఉండొచ్చని అంచనా. కొన్ని మార్కెట్‌ నివేదికలు దీని ధర 2,000 డాలర్లకు పైగా ఉండవచ్చని పేర్కొంటున్నాయి. అయితే అధికారిక ధరను యాపిల్‌ ప్రకటించాల్సి ఉంది.

iPhone 18 Series | ఐఫోన్ 18 ప్రో ప్రత్యేకతలు ఇవేనంటూ ప్రచారం..

ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌లో గత మోడళ్లతో పోలిస్తే డిజైన్‌, కెమెరా, బ్యాటరీలో మార్పులు ఉండొచ్చని అంటున్నారు. ముఖ్యంగా చిన్న Dynamic Island, వేరియబుల్‌ అపెర్చర్‌ కెమెరా, పెద్ద బ్యాటరీ సామర్థ్యం వంటి అప్‌గ్రేడ్స్‌పై టెక్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

iPhone 18 Series | యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్‌పైనా అంచనాలు

ఐఫోన్‌లతో పాటు కొత్త Apple Watch Series 12ను కూడా యాపిల్‌ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. డిజైన్‌లో మార్పులతో పాటు హెల్త్‌ ట్రాకింగ్‌ ఫీచర్లకు మరింత ప్రాధాన్యం ఇవ్వొచ్చని తెలుస్తోంది.

అదేవిధంగా కొత్త AirPods మోడల్‌ కూడా ఈవెంట్‌లో కనిపించే అవకాశం ఉంది. హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌ వంటి హెల్త్‌ ఫీచర్లు, కొత్త చిప్‌ తదితర అప్‌గ్రేడ్స్‌ ఉంటాయని వార్తలు వస్తున్నప్పటికీ.. తుది స్పెసిఫికేషన్లు మాత్రం ఈవెంట్‌లోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

iPhone 18 Series | కొత్త సీఈఓ జాన్ టెర్నస్‌కు తొలి మెగా లాంచ్

ఈ యాపిల్ ఈవెంట్‌ కంపెనీకి మరో ప్రత్యేకత ఉంది. కొత్త సీఈఓ జాన్ టెర్నస్‌ నాయకత్వంలో జరుగుతున్న తొలి ప్రధాన ఐఫోన్‌ లాంచ్‌ ఇది. టిమ్ కుక్‌ స్థానంలో సెప్టెంబరు 1 నుంచి టెర్నస్‌ యాపిల్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అందువల్ల కొత్త నాయకత్వంలో యాపిల్‌ తొలి ప్రొడక్ట్‌ లాంచ్‌ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి కూడా నెలకొంది.

iPhone 18 Series | ధరలు పెరిగే అవకాశముందా?

మెమరీతో పాటు ఇతర కాంపోనెంట్ల ధరలు పెరగడం, సరఫరా వ్యయాలు అధికం కావడం వంటి కారణాలతో కొత్త ప్రీమియం డివైజ్‌ల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ముఖ్యంగా ఫోల్డబుల్‌ ఐఫోన్‌ అత్యంత ఖరీదైన యాపిల్‌ ఫోన్‌గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే అధికారిక ధరలు, ఫీచర్లు, మార్కెట్‌ లభ్యతపై స్పష్టత సెప్టెంబరు 9 ఈవెంట్‌ తర్వాతే రానుంది.

మొత్తంగా.. ఫోల్డబుల్‌ ఐఫోన్‌, ఐఫోన్ 18 ప్రో సిరీస్‌, కొత్త వేరబుల్స్‌తో ఈ ఏడాది యాపిల్‌ ఈవెంట్‌ సంస్థ చరిత్రలో కీలక లాంచ్‌గా నిలిచే అవకాశముంది. ముఖ్యంగా ఫోల్డబుల్‌ ఫోన్‌తో యాపిల్‌ ఫోల్డబుల్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టడం టెక్‌ రంగంలో ఆసక్తికర పరిణామంగా మారనుంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *