Governor Meeting | గవర్నర్​ను కలిసిన కాంగ్రెస్​ నేతలు.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలపై చర్యల కోసమేనా?

కాంగ్రెస్​ ముఖ్య నేతలు బుధవారం సాయంత్రం గవర్నర్​ శివప్రతాప్​ శుక్లాను కలిశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Governor Meeting | రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అనంతరం జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్​ పెరిగింది. బీఆర్​ఎస్​ (BRS) ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం.. చర్యలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్​ ముఖ్య నేతలు బుధవారం సాయంత్రం గవర్నర్​ శివ ప్రతాప్ శుక్లాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నల్ల టీ షర్టులు ధరించి వచ్చిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్​ఎస్​ సభ్యులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అంతేగాకుండా ఎమ్మెల్సీ తాతా మధు (MLC Madhu) స్పీకర్​ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్​పై పోలీసులు కేసు పెట్టి అరెస్ట్​ చేశారు. అంతేగాకుండా పోలీసులపై దాడి చేశారని కేటీఆర్​, హరీశ్​రావు సహా ఎమ్మెల్యేలపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షిస్తామని సీఎం సభలో ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్​ నేతలు గవర్నర్​తో భేటీ అయ్యారు.

Governor Meeting | ఉచ్చు బిగుస్తుందా..

అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాలపై బుధవారం మధ్యాహ్నం బీఆర్​ఎస్​ సభ్యులు గవర్నర్​ను కలిశారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని చెప్పారు. అయితే బీర్​ఎస్​ సభ్యులే పోలీసులపై దాడి చేశారని, ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్​ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్​ నాయకులు పేర్కొంటున్నారు. అంతేగాకుండా ఎర్రవల్లి కాంగ్రెస్​ నేతలు కేసీఆర్​ ఫామ్​హౌస్​ ముట్టడికి వెళ్లగా.. బీఆర్​ఎస్​ కార్యకర్తలు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ ఘటనలపై ప్రభుత్వం సీరియస్​గా ఉంది. ఇప్పటికే విచారణ కోసం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేకాధికారిని నియమించారు. ఈ క్రమంలో బీఆర్​ఎస్​ నేతల చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్​ నేతలు గవర్నర్​ను కలిశారు. అయితే ఏ విషయంలో వారు కలిశారనే వివరాలు తెలుపకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.

Governor Meeting | డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్​, సీతక్క, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్​, అడ్లూరి లక్ష్మణ్​, అజారుద్దీన్​, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, కవ్వంపల్లి సత్యనారాయణ గవర్నర్​ను కలిసిన వారిలో ఉన్నారు. ఆయనతో భేటీ అనంతరం వీరు వినతి పత్రం సమర్పించారు. గవర్నర్​ను కలిసిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు మాత్రమే ఉండటం గమనార్హం.

దీనిని కూడా చదవండి : Assembly Incident | బాధ్యులపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.