Karnataka Vande Mataram | వందేమాతరం తొలి రెండు చరణాలు మాత్రమే పాడండి.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

వందేమాతరం జాతీయ గీతాలాలాపన విషయంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Karnataka Vande Mataram | ‘వందేమాతరం’  ( Vande Mataram )జాతీయ గీతాలాలాపన విషయంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమాలు, వేడుకల్లో ఈ గీతంలోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడాలని స్పష్టం చేసింది. వేడుకల్లో ఏకరూపత, గౌరవం, సరైన ప్రోటోకాల్‌ పాటించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఈ నిర్ణయం వెనుక కారణాలను పేర్కొంది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు భిన్నంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Karnataka Vande Mataram | భిన్నంగా కాంగ్రెస్ వైఖరి..

ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ మీటింగ్స్, అధికారిక కార్యక్రమాల్లో పూర్తి ‘వందేమాతరం’ పాడటాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, జాతీయ గీతాలాపనకు అడ్డు తగిలితే చట్టపరమైన చర్యలు తీసుకునేలా పార్లమెంట్‌లో బిల్లు కూడా తెచ్చింది. అయితే కేంద్ర వైఖరికి భిన్నంగా కర్ణాటక సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇది కాంగ్రెస్ పార్టీ పాత విధానానికి అనుగుణంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే పార్టీ కార్యక్రమాల్లో తొలి రెండు చరణాలకే పరిమితం చేస్తున్నట్లు గతంలోనే కాంగ్రెస్ స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి దిగ్గజాల సమక్షంలోనే ఆనాడు ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇటీవల గోవాలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా పూర్తి వెర్షన్ కాకుండా తొలి రెండు చరణాలే పాడటంతో బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిపై ఖర్గే స్పందిస్తూ.. జాతిపిత గాంధీ, నెహ్రూ, వాజ్‌పేయి వంటి నేతలు కూడా ఇదే పద్ధతిని పాటించారని కౌంటర్ ఇచ్చారు.

Karnataka Vande Mataram | వందేమాతరం వెనుక చరిత్ర..

ప్రముఖ రచయిత బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘ఆనందమఠం’ నవల నుంచి ‘వందేమాతరం’ గీతాన్ని తీసుకున్నారు. 1896లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని తొలిసారిగా ఆలపించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఈ గీతం దేశభక్తిని, ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. అయితే, ఆ కాలంలో గీతంలోని కొన్ని భాగాలపై ముస్లిం లీగ్ అభ్యంతరాలు తెలపడంతో.. 1937లో కాంగ్రెస్ పార్టీ దీనిని తొలి రెండు చరణాలకే పరిమితం చేస్తూ తీర్మానం చేసింది. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తి గీతం పాడాలని పట్టుబడుతుండగా, కాంగ్రెస్ మాత్రం తమ పాత సంప్రదాయాన్నే కొనసాగిస్తుండటం గమనార్హం. కర్ణాటక సర్కార్ తాజా ఉత్తర్వులతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

ఇది కూడా చదవండి:  Nizamabad Water Resources | నీటి వనరులు వృథా కాకుండా చూడాలి..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *