అక్షరటుడే, మెండోరా : Private Tender Protest | టీజీపీజాక్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం పోచంపాడ్ జెన్‌కో కార్యాలయం (Pochampad GENCO Office)లో ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
Private Tender Protest | 46రోజులుగా లంచ్ అవర్లో..
గత 46 రోజులుగా లంచ్ అవర్ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గతనెల19న విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. గతనెల 29న మేనేజ్‌మెంట్ టీజీపీజాక్ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించింది. ఈ సందర్భంగా టీజీపీజాక్ ప్రతిపాదించిన 14 డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చ జరగగా, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు మేనేజ్‌మెంట్ 15 రోజుల సమయం కోరింది. అయితే 15 రోజుల గడువు పూర్తికాకముందే కోల్, యాష్ ప్లాంట్ల నిర్వహణకు సంబంధించిన టెండర్ డ్రాఫ్ట్ ప్రక్రియను పూర్తి చేసి సంతకాల కోసం పంపినట్లు సమాచారం రావడంతో టీజీపీజాక్ నాయకులు తీవ్రంగా ఖండించారు. చర్చలకు ఆహ్వానించి డిమాండ్లపై నిర్ణయం తీసుకునేందుకు సమయం కోరిన మేనేజ్‌మెంట్, మరోవైపు గడువు పూర్తికాకముందే టెండర్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
Private Tender Protest | టీజీపీజాక్ సెంట్రల్ బాడీ పిలుపు మేరకు..
టీజీపీజాక్ సెంట్రల్ బాడీ పిలుపు మేరకు పోచంపాడ్ జెన్‌కో కార్యాలయం ఎదుట ఉద్యోగులు, కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోల్ ప్లాంట్, యాష్ ప్లాంట్ నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉన్నప్పటికీ, చర్చల గడువు పూర్తికాకముందే టెండర్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం సరికాదని నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగ, కార్మిక ప్రయోజనాలను కాపాడేందుకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజీపీజాక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Five Day Banking | ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి