Jindal Supreme IPO | ఐపీవోకు స్టీల్ ఉత్పత్తుల కంపెనీ రేపటినుంచే అందుబాటులోకి..

స్టీల్ పైపులు, ట్యూబులు, ఇతర స్టీల్ ఉత్పత్తుల తయారీ మరియు సరఫరాలో అగ్రగామి సంస్థలలో ఒకటైన జిందాల్ సుప్రీం పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 16న ప్రారంభమవుతుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jindal Supreme IPO | స్టీల్ పైపులు, ట్యూబులు మరియు ఇతర స్టీల్ ఉత్పత్తుల తయారీ మరియు సరఫరాలో అగ్రగామి సంస్థలలో ఒకటైన జిందాల్ సుప్రీం కంపెనీని 1974లో స్థాపించారు. దీని ఉత్పత్తి శ్రేణిలో మైల్డ్ స్టీల్ (ఎంఎస్ ) బ్లాక్ పైపులు మరియు ట్యూబులు, గాల్వనైజ్డ్ పైపులు, మెటల్ బీమ్ క్రాష్ బారియర్‌లు మరియు గాల్వనైజ్డ్ ఐరన్ (జీఐ) ట్యూబులర్ పోల్స్ ఉన్నాయి.

Jindal Supreme IPO | ఏఏ రంగాలలో వినియోగిస్తారంటే..

జిందాల్ సుప్రీం ఉత్పత్తులను నీటి సరఫరా మరియు ప్లంబింగ్, మౌలిక సదుపాయాలు మరియు నిర్మాణం, రోడ్లు మరియు హైవేలు, వంతెనలు, ఆయిల్ మరియు గ్యాస్, రసాయనాలు, వ్యవసాయం మరియు గ్రామీణ విద్యుదీకరణ వంటి రంగాలలో ఉపయోగిస్తారు. 2025 ఆర్థిక సంవత్సరంలో భద్రతను మెరుగుపరచడానికి హైవేలు మరియు రోడ్లపై ఉపయోగించే డబ్ల్యూ -బీమ్ మరియు త్రీ -బీమ్ మెటల్ క్రాష్ బారియర్‌లను జిందాల్ తయారు చేయడం ప్రారంభించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో వీధి దీపాల కోసం ఉపయోగించే జీఐ ట్యూబులర్ పోల్స్‌ను తయారీని ప్రారంభించింది. దీని తయారీ కేంద్రం హిసార్‌లో ఉంది.

Jindal Supreme IPO | రూ. 124.88 కోట్ల సమీకరణ లక్ష్యం..

మార్కెట్‌నుంచి రూ. 124.88 కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో జిందాల్ సుప్రీం కంపెనీ ఐపీవో (IPO)కు వచ్చింది. ఇందులో కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 99.89 కోట్లు సమీకరించనున్నారు. మిగిలిన మొత్తం ఆఫర్ ఫర్ సేల్. ఐపీవో ద్వారా సమకూరే నిధులను రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించడం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనం కోసం వినియోగించనున్నారు.

ఆర్థిక పరిస్థితి : కంపెనీ 2025లో రూ. 604.74 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది 2026 నాటికి రూ. 675.94 కోట్లకు చేరింది. ఇదే కాలంలో నికర లాభం రూ. 24.27 కోట్ల నుంచి రూ. 22.53 కోట్లకు తగ్గింది.

ధరల శ్రేణి : కంపెనీ ఒక్కో షేరు ధరను రూ. 88 నుంచి రూ. 93 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 161 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,973తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కోటా : క్యూఐబీ కోటా 50శాతం, రిటైల్ కోటా 35 శాతం, మరియు ఎన్ఐఐ కోటా 15శాతం కేటాయించారు.

జీఎంపీ : కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 27 గా ఉంది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలో 29 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ముఖ్యమైన తేదీలు : జిందాల్ సుప్రీం కంపెనీ ఐపీవో సెప్టెంబర్ 16 న ఓపెన్ అవుతుంది. 18 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. షేర్ల కేటాయింపు 21 న రాత్రి ఉంటుంది. కంపెనీ షేర్లు 23న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.

ఇది కూడా చదవండి..: iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రో ప్రీ-బుకింగ్స్ షురూ.. క్రోమాలో ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *