అక్షరటుడే, కామారెడ్డి: Acid Attack | ఇల్లు వదిలి బయటకు వెళ్లిన వివాహితపై యాసిడ్ దాడి జరిగింది. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
Acid Attack | భిక్కనూరుకు చెందిన..
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరుకు (Bhikanoor) చెందిన దివ్యవాణి(32)కి పదేళ్ల క్రితం నిజామాబాద్‌కు(Nizamabad) చెందిన అరవింద్‌తో వివాహమైంది. కుటుంబ కలహాల కారణంగా గత కొన్ని నెలలుగా ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె భిక్కనూరులోని తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. ఈ నెల 11న పిల్లలను ఇంట్లో వదిలి బయటకు వెళ్లిన దివ్యవాణి తిరిగి రాలేదు. దాంతో ఆందోళన చెందిన తండ్రి మధు భిక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.
ఈ క్రమంలో ఆదివారం జంగంపల్లి శివారులో యాసిడ్ గాయాలతో పడి ఉన్న దివ్యవాణిని గుర్తించిన పోలీసులు హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితిని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ స్వయంగా పరిశీలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా, సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. తన కూతురిపై అల్లుడు అరవింద్, అతని కుటుంబ సభ్యులే యాసిడ్ పోసి దాడి చేశారని మృతురాలి తండ్రి మధు ఆరోపిస్తున్నారు. యాసిడ్ దాడి ఆత్మహత్యాయత్నమా, హత్యాయత్నమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భిక్కనూరు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ట్రావెల్స్ బస్సు బీభత్సం