అక్షరటుడే వెబ్‌డెస్క్: Belagavi Fridge Blast | కర్ణాటకలోని ( Karnataka )బెళగావిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లోని ఫ్రిజ్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెళగావి నగరంలోని సెంట్రల్ బస్‌స్టాండ్ సమీపంలోని చావట్ గల్లీకి చెందిన గజానన్ దామోనే కుటుంబం గణేశ్ చతుర్థి వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా తమ ఇంట్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమవారం రాత్రి అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత ఫ్రిజ్‌కు సమీపంలో ఉన్న షెడ్‌లో నిద్రకు ఉపక్రమించారు.
Belagavi Fridge Blast | భారీ శబ్దం..
అర్ధరాత్రి సుమారు 2:15 గంటల సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు అప్రమత్తమై వెంటనే ఆ షెడ్ వద్దకు పరుగెత్తారు. అప్పటికే అక్కడ మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే స్పందించి గజానన్, రోషన్‌లను సురక్షితంగా బయటకు వెలికితీశారు. అయితే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో మిగతా నలుగురు కుటుంబ సభ్యులు అందులోనే చిక్కుకుని సజీవ దహనమయ్యారు.
Belagavi Fridge Blast | క్షతగాత్రుల వివరాలు..
ఈ ప్రమాదంలో భారతి దామోనే (50), శారద దామోనే (45), గంగ దామోనే (25), ప్రియ దామోనే (24) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో శారద.. గజానన్ భార్య కాగా, భారతి ఆయన సోదరి. అలాగే గంగ, ప్రియలు గజానన్ దంపతుల కుమార్తెలు. తీవ్రంగా గాయపడిన గజానన్ (65), ఆయన కుమారుడు రోషన్ (21) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గజానన్‌కు సుమారు 60 శాతం కాలిన గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. గజానన్ వృత్తిరీత్యా కార్పెంటర్‌గా పనిచేస్తుండగా, మిగతా కుటుంబ సభ్యులు ఇళ్లలో పనులు, చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
Belagavi Fridge Blast | షార్ట్ సర్క్యూట్ కారణమా?
ఈ ప్రమాద ధాటికి కాంక్రీట్ గోడలు లేని ఆ షెడ్ పూర్తిగా ధ్వంసమై, విలువైన వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ప్రాథమిక దర్యాప్తులో ఫ్రిజ్ పేలినట్లు తేలినప్పటికీ.. అసలు కారణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులు గణేశ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అలంకరణ లైట్ల (డెకరేషన్ లైట్లు) కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత అసలు విషయాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Russia Tariff Bill | ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయం.. రష్యా ఆంక్షల బిల్లులో భారత్ పేరు