అక్షరటుడే, కామారెడ్డి: RTC Bus Accident | ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం పాల్వంచ (Palwancha Accident) మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది.
RTC Bus Accident | చుక్కాపూర్ వెళ్లి వస్తుండగా..
పోలీసులు.. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని బతుకమ్మ కుంట కాలనీలో నివాసం ఉంటున్న నకిర్తి రాజు తన భార్య చిత్ర(25), కూతురు హర్షిణి(6), కొడుకు సాత్విక్(9), అత్త శంకరమ్మతో కలిసి ఆటోలో చుక్కాపూర్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పాల్వంచ మండల కేంద్ర శివారులోకి రాగానే కామారెడ్డి నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న రాజు, అతని భార్య చిత్ర, అత్త శంకరమ్మ, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజు భార్య చిత్ర మృతి చెందింది. మిగతా నలుగురికి చికిత్స కొనసాగుతోంది. చిత్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల స్వగ్రామం దంతేపల్లి అని, బతుకుదెరువు కోసం కామారెడ్డికి వచ్చి బతుకమ్మ కుంట కాలనీలో నివాసం ఉంటున్నారని సమాచారం.
ఇది కూడా చదవండి: మహిళను కారుతో ఢీకొట్టి.. ఈడ్చుకెళ్లిన డ్రైవర్