Santosh Nagar Road Accident | హైదరాబాద్‌లో విషాదం.. కారు ఢీకొని బాలుడు మృతి

హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ ఐఎస్ సదన్ ఎక్స్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Santosh Nagar Road Accident | హైదరాబాద్‌లోని  ( Hyderabad ) సంతోష్‌నగర్ ఐఎస్ సదన్ ఎక్స్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొనడంతో మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారుతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. మొహియుద్దీన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక స్వీకార్ హోటల్ వద్దకు పార్సెల్ తీసుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై ఉన్న మూడేళ్ల చిన్నారి ఇజ్హాన్‌ ఉద్దీన్‌ను అతివేగంగా వచ్చిన కారు తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక షాలిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఓవైసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. కళ్లముందే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

Santosh Nagar Road Accident | పోలీసుల దర్యాప్తు..

సమాచారం అందుకున్న యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మెరాజ్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకుని, దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు. ప్రమాదానికి కారణమైన కారు నంబర్‌ను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల‘ఫుటేజ్’ (దృశ్యాలు) , ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో పరారైన కారు, డ్రైవర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Santosh Nagar Road Accident |పోలీసుల హెచ్చరిక..

రద్దీ ప్రాంతాలు, నివాస కాలనీలు, ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలను అతివేగంగా నడపవద్దని పోలీసులు హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లలు రోడ్లపైకి రాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, వేగం కంటే ప్రాణాలే అత్యంత విలువైనవని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి:  Houthi Missile Attacks | సౌదీపై క్షిపణులతో హౌతీల దాడులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *