అక్షరటుడే వెబ్డెస్క్: Mumbai Garba Controversy | మహారాష్ట్రలోని ముంబై బోరివలిలో జరగనున్న భారీ గర్బా (Garba) వేడుకల్లో ముస్లింల ప్రవేశంపై తీవ్ర వివాదం చెలరేగింది. ఈ కార్యక్రమంలో ముస్లింలు పాల్గొనాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయ్ ( Sanjay Upadhyay )స్పష్టం చేశారు. ఆదివారం నిర్వహించిన భూమి పూజ, ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మరో బీజేపీ ఎమ్మెల్యే మనీషా చౌదరి, మాజీ ఎంపీ గోపాల్ శెట్టి కూడా పాల్గొన్నారు.
Mumbai Garba Controversy | తిలకం ధరిస్తేనే ప్రవేశం..
ఈసారి గర్బా వేడుకల్లో ముస్లింలకు సాధారణ ప్రవేశం ఉండదని సంజయ్ ఉపాధ్యాయ్ తేల్చిచెప్పారు. ఒకవేళ వారు రావాలనుకుంటే తమ భార్య, సోదరి లేదా కుమార్తెతో కలిసి రావాలని, నుదిటిపై తిలకం ధరించి దేవతలను పూజించాలని షరతు పెట్టారు. సనాతన ధర్మాన్ని పూర్తిగా విశ్వసించిన తర్వాతే గర్బా వేదికపైకి రావాలని ఆయన అన్నారు. గర్బా కార్యక్రమాలు ‘లవ్ జిహాద్’కు వేదికగా మారకూడదని ఆయన వ్యాఖ్యానించారు.
మాజీ ఎంపీ గోపాల్ శెట్టి మాట్లాడుతూ.. హిందూ నేతలు ఈద్ వేడుకలకు వెళ్లినప్పుడు టోపీలు ధరిస్తారని, అదే విధంగా గర్బాకు రావాలనుకునే ముస్లింలు తిలకం ధరించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ముస్లింలు, క్రైస్తవుల పూర్వీకులు అందరూ హిందువులేనని ఆయన పేర్కొన్నారు.
Mumbai Garba Controversy | వీహెచ్పీ డిమాండ్..
గర్బా వేడుకలకు వచ్చేవారి వివరాలను ఖరారు చేయడానికి వారి ఆధార్ కార్డులను తప్పనిసరిగా చెక్ చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఇప్పటికే మహారాష్ట్రవ్యాప్తంగా దాండియా, గర్బా వేడుకల్లోకి ముస్లింల ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హిందూ మతాచారాలను నమ్మని వారు ఈ వేడుకల్లో ఎందుకు పాల్గొంటారని ప్రశ్నిస్తూ.. ముస్లింలను ఈ ఈవెంట్లలోకి అనుమతించకూడదని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేస్తోంది. గర్బా అనేది కేవలం డ్యాన్స్ ఈవెంట్ కాదని, అది దేవతలను ఆరాధించే ఒక పవిత్ర పండగ అని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mobile Phone Blast | పిడుగుపాటుకు పేలిన రెండు మొబైల్ ఫోన్లు.. తప్పిన ప్రమాదం