అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క సాగునీటి కాల్వ కూడా తవ్వింది లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్కరికీ ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలయ్యాయని విమర్శించారు.
Harish Rao | ఉద్యోగాల ఇస్తామని చెప్పి..
మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ( Revanth Reddy )ఎన్నికల హామీ ఇచ్చారని, రాష్ట్రంలో ఏ మహిళకైనా ఆ నగదు అందిందా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను కూడా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాల ఇస్తామని చెప్పి మోసం చేశారని, సామాన్య యువతకు ఉద్యోగాలు రాకపోయినా.. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు, ఆయన సన్నిహితులకు మాత్రం ఉద్యోగాలు దక్కాయని ఎద్దేవా చేశారు.
Harish Rao | నిలదీస్తున్నందుకే దాడులు..
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న అక్రమ భూ కబ్జాలను తాము నిలదీస్తున్నందుకే తమపై దాడులకు పాల్పడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతల ఆస్తులపై, అలాగే తమ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల సాధన కోసం ఎంపీలు దిల్లీలో పోరాటం చేయాలని హితవు పలికారు.
ఇది కూడా చదవండి: Mobile Phone Blast | పిడుగుపాటుకు పేలిన రెండు మొబైల్ ఫోన్లు.. తప్పిన ప్రమాదం