అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Smart Traffic | హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలాగ్, మెగా ఇంజనీరింగ్ సంస్థలకు సూచించారు. అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్మాన్, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ (MEIL) ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో సమావేశం అయింది.
ఈ రెండు సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో అమలు చేయనున్న ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థపై సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఇంటిగ్రేట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో అనుసంధానం చేయాలని చెప్పారు. నగరంలో ఎదురయ్యే సమస్యలకు సత్వర పరిష్కారానికి దోహదపడే ఈ సాంకేతిక వ్యవస్థ పూర్తిగా నెక్స్ట్ జనరేషన్ ఇంటెలిజెన్స్ సదుపాయమని పేర్కొంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్టు వివరాలు, వాటి ప్రయోజనాలను సమావేశంలో తెలిపారు.
Hyderabad Smart Traffic | ముందుగానే గుర్తించాలి
ట్రాఫిక్ రద్దీని గుర్తించి తదనుగుణంగా సిగ్నళ్ల వ్యవస్థ, ఇతర లీకేజీలను ముందుగానే గుర్తించి మరమ్మతులు చేపట్టడం, అవసరానికి అనుగుణంగా విద్యుత్ వినియోగాన్ని నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకు మార్గం సుగమం చేయడం వంటి కాగ్నిటివ్ సిటీస్ (Cognitive Cities) రూపకల్పనకు ఉన్న అవకాశాలను వివరించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Cabinet Infrastructure Projects | మౌలిక వసతులకు పెద్దపీట.. రూ.14,115 కోట్లతో రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం