అక్షరటుడే వెబ్‌డెస్క్: Chandrababu Delhi Tour | ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, ఆర్థిక సహకారం సాధించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
Chandrababu Delhi Tour | కేంద్రం మద్దతు కోరుతూ..
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు తుది ఆమోదం తెలపాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరనున్నారు. అలాగే తీర ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకమైన విశాఖ బీచ్ కారిడార్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు.
Chandrababu Delhi Tour | వ్యవసాయ రంగానికి పెద్దపీట..
రాష్ట్రంలోని జలవనరులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయడం, గోదావరి వరద జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రధానితో చర్చిస్తారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయి నదుల అనుసంధానంతో పాటు, రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఆర్థిక , మౌలిక వసతుల సహాయాన్ని కోరనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై రాయలసీమ ప్రాంతాన్ని ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు, మద్దతుపై చర్చించనున్నారు.
Chandrababu Delhi Tour | సీఐఐ సదస్సు..
ఇటీవల ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తిన కరువు పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు ఇతర కేంద్ర పెద్దలను సీఎం కలవనున్నారు. ఢిల్లీలో జరగనున్న సీఐఐ (CII) పార్ట్‌నర్‌షిప్ సదస్సు ‘కర్టెన్ రైజర్’ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ కీలక సమావేశాలు , పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు గురువారం రాత్రికి అమరావతికి తిరిగి పయనం కానున్నారు.
ఇది కూడా చదవండి: AEO Death Kamareddy | ఫార్మ్ హౌస్‌లో ఏఈవో బలవన్మరణం