Tri Cities Half Marathon 2026 | వరంగల్‌లో ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ 2026.. ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచడంతో పాటు ఆరోగ్యంపై చైతన్యం నింపేందుకు ఇటువంటి మారథాన్‌లు ఎంతో దోహదపడతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొనియాడారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tri Cities Half Marathon 2026 | యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచడంతో పాటు ఆరోగ్యంపై చైతన్యం నింపేందుకు ఇటువంటి మారథాన్‌లు ఎంతో దోహదపడతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ( Sridhar Babu )  కొనియాడారు. నాయిని విశాల్ ట్రస్ట్ , క్రెడాయ్ (CREDAI) వరంగల్ ఉమ్మడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ట్రై సిటీస్ హాఫ్ మారథాన్–2026’ రెండో ఎడిషన్‌కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులతో కలిసి మంత్రి 5K పరుగును జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.

Tri Cities Half Marathon 2026  | ఆరోగ్యమే మహాభాగ్యం..

ఈ పరుగు కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రోజూ శారీరక వ్యాయామం, ఆటలు, ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలతో పాటు పలు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని తెలిపారు. యువత చెడు అలవాట్లు, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలను తమ జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మారథాన్‌లో దాదాపు 5 వేల మంది వరకు ఉత్సాహంగా పాల్గొనడం హర్షణీయమన్నారు.

Tri Cities Half Marathon 2026 | ఓరుగల్లు అభివృద్ధికి..

వరంగల్, హన్మకొండ నగరాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివరించారు. ముఖ్యంగా వరంగల్ ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ విస్తరణ, కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు చురుగ్గా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులలోని ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్వాహకులకు సూచించారు.

Tri Cities Half Marathon 2026 | క్రీడలతో పెరిగే ఆత్మవిశ్వాసం..

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. పెరుగుతున్న ఒత్తిడి యుగంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అత్యంత కీలకమన్నారు. యువతను సన్మార్గంలో నడిపిస్తూ, క్రీడాస్ఫూర్తిని నింపడమే ఈ మారథాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్రెడాయ్ ప్రతినిధులు, నిర్వాహకులు, స్పాన్సర్లు , వరంగల్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి:  Anant Singh Controversy | నితీష్​ కుమార్​ కోసం 9 మందిని చంపించా.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *