అక్షరటుడే వెబ్డెస్క్: Lemon Chilli Vehicle Ritual | హిందూ సంప్రదాయంలో కొత్తగా ఏ వాహనం కొనుగోలు చేసినా.. చివరికి సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నా సరే, ముందుగా దానికి శాస్త్రోక్తంగా పూజ చేయించడం ఆనవాయితీ. ముఖ్యంగా దసరా వంటి పవిత్ర పండుగల సమయంలో వాహన పూజలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్రమాదాలు జరగకుండా, ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకుంటూ భక్తులు హనుమంతుడు లేదా దుర్గాదేవి ఆలయాలకు వెళ్లి పూజలు చేయిస్తుంటారు. ఈ పూజా సమయంలో వాహనాలకు నిమ్మకాయలు ( Lemon ) , పచ్చిమిరపకాయలతో చేసిన దండను కట్టడం మనం చూస్తూనే ఉంటాం. అసలు వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలు ఎందుకు కడతారు? దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
Lemon Chilli Vehicle Ritual | జ్యోతిష్య శాస్త్ర కారణం..
నవగ్రహాలలో ఎరుపు రంగు, ఉగ్రత్వానికి సంకేతం కుజ గ్రహం. కుజుడు ప్రమాదాలకు కారకుడని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఆ కుజ గ్రహానికి అధిపతి హనుమంతుడు. ఇక పులుపు రుచి కలిగిన నిమ్మకాయ సంపదను ఇచ్చే శుక్ర గ్రహానికి, కారంగా ఉండే మిరపకాయ అధికారానికి కారకుడైన రవి గ్రహానికి సంకేతాలు. వాహనం నడిపే వారిపై ఈ గ్రహాల ప్రభావం పడకుండా, ప్రయాణం సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే నిమ్మ, మిరపకాయలు కడతారు.
Lemon Chilli Vehicle Ritual | అలక్ష్మీ దేవి శాంతి కోసం..
పౌరాణిక నమ్మకాల ప్రకారం లక్ష్మీదేవికి తీపి పదార్థాలు ఇష్టమైతే, ఆమె అక్క అయిన ‘అలక్ష్మి’కి కారం, పులుపు అంటే చాలా ఇష్టం. వాహనాలకు చెడు దృష్టి లేదా నకారాత్మక శక్తులు సోకకుండా ఉండేందుకు అలక్ష్మీ దేవిని శాంతింపజేయాలని నిమ్మ, మిరపకాయలను కడతారు. దీనివల్ల ఆమె శాంతించి వాహనానికి ఎలాంటి విపత్తు రాకుండా కాపాడుతుందని నమ్ముతారు.
Lemon Chilli Vehicle Ritual| పూర్వీకుల ప్రయాణ చిట్కా..
పూర్వకాలంలో ఎడ్లబండ్లు లేదా కాలి నడకన సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు. ఆ సమయంలో తమ వెంట నిమ్మకాయలు, మిరపకాయలను తీసుకెళ్లేవారు. ప్రయాణంలో నీరసంగా అనిపించినప్పుడు నిమ్మరసం తాగి శక్తిని పొందేందుకు, అలాగే విషపూరిత కీటకాలు లేదా పాములు కుట్టినప్పుడు నివారణ కోసం మిరపకాయలను ఉపయోగించేవారు. కాలక్రమేణా ఆ అలవాటే వాహనాలకు నిమ్మ, మిరపకాయలు కట్టే ఆచారంగా మారింది.
Lemon Chilli Vehicle Ritual | దిష్టి నివారణకు..
‘నరుడి దృష్టికి నాపరాళ్లైనా పగులుతాయి’ అనేది నానుడి. కొత్త వాహనంపై ఇతరుల దృష్టి లేదా దిష్టి పడకుండా ఉండేందుకు నిమ్మకాయ, మిరపకాయల దండను కడతారు. ఇది నెగటివ్ ఎనర్జీని పీల్చుకుని వాహనాన్ని కాపాడుతుందని నమ్ముతారు.
దుష్ట శక్తులు దూరంగా..
వాహనాలపై ఎలాంటి దుష్ట శక్తులు, చెడు గాలి ప్రభావం పడకుండా ఉండేందుకు కూడా నిమ్మ, మిరపకాయలను రక్షణ కవచంగా ఉపయోగిస్తారు. దసరా పండుగ రోజు వాహన పూజ చేసుకునేటప్పుడు ఈ ఆచారాన్ని పాటించడం వెనుక ఇన్ని విశేషాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Anant Singh Controversy | నితీష్ కుమార్ కోసం 9 మందిని చంపించా.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు