Bhatti Vikramarka Comments | కోల్ లేకుండా థర్మల్ పవర్ కడితే ఎలా?.. హరీష్‌ రావుకు భట్టి విక్రమార్క ప్రశ్న

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని, కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాల డిమాండ్‌తో సమానంగా మన రాష్ట్రంలోనూ పీక్ డిమాండ్ (19,892 మెగావాట్లు) నమోదవుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:  Bhatti Vikramarka Comments | రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని, కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాల డిమాండ్‌తో సమానంగా మన రాష్ట్రంలోనూ పీక్ డిమాండ్ (19,892 మెగావాట్లు) నమోదవుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఎలాంటి కోతలు లేకుండా ప్రజలకు నిరంతరం విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగంపై తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వం , మాజీ మంత్రి హరీష్‌రావుపై ( Harish Rao )  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Bhatti Vikramarka Comments | తప్పిదాలను సరిదిద్దుతున్నాం..

యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటులో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసలు డీపీఆర్ (DPR) లేకుండా, కనీసం కోల్ లింకేజ్ (బొగ్గు సరఫరా ప్రణాళిక) కూడా చేయకుండా థర్మల్ ప్లాంట్ కట్టారని ఆరోపించారు. “నది లేకుండా హైడల్ పవర్, కోల్ లేకుండా థర్మల్ పవర్ పెడితే ఎలా ఉంటుంది?” అని ప్రశ్నించిన ఆయన.. ప్లానింగ్ లేకుండా ప్లాంట్లు కట్టి రాష్ట్ర ప్రజల మీద రూ. 40 వేల కోట్ల ఆర్థిక భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో బొగ్గు సరిపోకపోతే కేంద్రం నుంచి కోల్ బ్లాక్స్ తెచ్చేందుకు గత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, మైనింగ్ రంగంలో 14 బ్లాకులు మూతపడినా పట్టించుకోలేదని విమర్శించారు.

Bhatti Vikramarka Comments | కేసులను క్లియర్ చేయించి..

తాము అధికారంలోకి వచ్చాక నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) లో ఉన్న కేసులను క్లియర్ చేయించి ప్లాంటును పూర్తి చేశామని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ.. నైనీ బ్లాక్ నుంచి బొగ్గు తెప్పించి యాదాద్రి ప్లాంట్‌కు సప్లై చేస్తున్నామని చెప్పారు. ప్లాంట్ జీవితకాలం 25 ఏళ్లు కాగా, దీని ద్వారా యూనిట్‌కు రూ. 6.60 పైసలు పడుతోందని, ఇది కాకతీయ (రూ. 4.97), కొత్తగూడెం (రూ. 4.62) కంటే చాలా ఎక్కువని పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాజీ మంత్రి హరీష్‌రావు తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారని విమర్శించారు.

Bhatti Vikramarka Comments | ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి..

కష్టకాలంలోనూ ప్రాణాలకు తెగించి విద్యుత్ అందిస్తున్న సిబ్బందిని అభినందించాల్సింది పోయి, కొందరు నాయకులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అసత్య ప్రచారాలు చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. తాము పబ్లిక్ సెక్టార్‌ను నమ్మే ప్రభుత్వమని, రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా ఎవరు మాట్లాడినా ప్రజలే గమనిస్తున్నారని స్పష్టం చేశారు. తాము అమలు చేస్తున్న సరైన ప్రణాళికల వల్ల విద్యుత్ రంగంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి:  AEO Death Kamareddy | ఫార్మ్ హౌస్​లో ఏఈవో బలవన్మరణం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *