Telangana Assembly Sessions | రాజకీయ సమరం.. ప్రజా సమస్యలకు గ్రహణం.. అసెంబ్లీ వేదికగా మళ్లీ తిట్ల పర్వమేనా?

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Assembly Sessions | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అధ్యక్షతన BAC సమావేశం ఉంటుంది. సభ నిర్వహణ, పని దినాలు, అజెండాపై చర్చించనున్న BACలో చర్చిస్తారు.

కాగా, ఒకప్పుడు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే సామాన్య ప్రజలు టీవీలకు అతుక్కుపోయేవారు. ప్రజా సమస్యలపై సుదీర్ఘమైన, అర్థవంతమైన చర్చలు సాగుతుంటే ఎంతో ఆసక్తిగా గమనించేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. ప్రజాసమస్యలు పక్కకుపోయి, వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ఆరోపణలు, దూషణలకే అసెంబ్లీ ప్రాంగణం అడ్డాగా మారిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో.. ప్రజలు సభల నుంచి ఎలాంటి కొత్త పరిష్కారాలను ఆశించడం లేదు. అధికార, ప్రతిపక్షాల ముందస్తు వ్యూహాలు కూడా అదే సంకేతాన్ని ఇస్తున్నాయి.

Telangana Assembly Sessions | విమర్శలకే ప్రాధాన్యం..

సమావేశాలు ప్రారంభం కాకముందే ఇరుపక్షాలు తమ ఎజెండాను స్పష్టం చేశాయి. ఈ రాజకీయ హోరాహోరీ మధ్య ప్రజల నిజమైన చిక్కులు, అవసరాలు మాత్రం ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి.

RJ Charan Bigg Boss | రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ హౌస్‌కు.. నిజామాబాద్ కుర్రాడి జోరు

అధికార పక్షం: ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు హాజరు కాకపోవడం, ఆయన ఫామ్​హౌస్​కే పరిమిత కావడాన్ని ఎత్తిచూపాలనే దానిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేందుకు సిద్ధమవుతోంది.

ప్రతిపక్షం: ప్రభుత్వ పాలన వైఫల్యాలు, 20A భూముల వివాదం, హైడ్రా బాధితుల ఆందోళనలు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సమాయత్తమవుతోంది.

Telangana Assembly Sessions | తీరని ప్రజల సమస్యలు..

సభలో సమగ్రంగా చర్చించి పరిష్కరించాల్సిన ఎన్నో ప్రధాన అంశాలు మూలన పడుతున్నాయి.

రైతాంగ సమస్యలు: ఎరువుల (యూరియా) యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు, తాగునీటి కొరత వారిని వేధిస్తోంది.

వైద్యం & ఆరోగ్యం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, ఎక్స్‌రే ఫిలిమ్‌ల కొరత వేధిస్తుంటే, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఉచిత వైద్యానికి నిరాకరిస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు క్యాష్‌లెస్ వైద్యం అందక సొంత జేబుల నుంచే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.

విద్యారంగం & నిరుద్యోగం: పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, గురుకులాల్లో వసతుల లేమి, మధ్యాహ్న భోజనం నాణ్యతారాహిత్యం వంటి సమస్యలు విద్యా వ్యవస్థను వేధిస్తున్నాయి. మరోవైపు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

సంక్షేమ పథకాలు & హైడ్రా భయాలు: సరైన సమయానికి పెన్షన్లు అందక అవ్వాతాతలు, ఇందిరమ్మ ఇళ్ల విస్తరణ కోసం నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ‘హైడ్రా’ చర్యల వల్ల ఏ క్షణాన ఏ ఇల్లు కూలిపోతుందోనని ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం.

Telangana Assembly Sessions | ఎమ్మెల్యేలకు దక్కని సమయం.. వృథా అవుతున్న ప్రజాధనం

అసెంబ్లీలో మాట్లాడే సమయం మంత్రులకు, ముఖ్యమంత్రికి, ప్రధాన నాయకులకు మాత్రమే ఎక్కువ దక్కుతోంది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు, ఇతర నియోజకవర్గ ప్రతినిధులకు తమ ప్రాంత సమస్యలను లేవనెత్తే అవకాశమే లభించడం లేదు. దీనివల్ల తమ సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యేలు విఫలమయ్యారనే ముద్ర పడుతోందని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూతకాలపు ఆరోపణలు, ఒకరిపై ఒకరు చేసుకునే వ్యక్తిగత దాడులు పక్కనబెట్టి, వర్తమానంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించి, ప్రజా సమస్యలకు పరిష్కార వేదికగా అసెంబ్లీని మలచినప్పుడే ప్రజాస్వామ్యానికి సార్థకత, ప్రజాధనానికి రక్షణ లభిస్తాయి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *