అక్షరటుడే వెబ్‌డెస్క్: Palamuru Irrigation Projects | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )శుక్రవారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. జిల్లాలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా పరిశీలించిన సీఎం.. అనంతరం అధికారులతో భవిష్యత్ కార్యాచరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Palamuru Irrigation Projects | క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ పర్యటన..
ఈ పర్యటనలో భాగంగా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్ హౌస్‌ను సందర్శించిన రేవంత్ రెడ్డి, ఆ తర్వాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నిశితంగా పరిశీలించారు. నారాపూర్ రిజర్వాయర్‌తో పాటు ఎంఎల్‌కేఎల్‌ఐఎస్ లిఫ్ట్-1 పంప్ హౌస్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అలాగే వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించిన ప్యాకేజీ-9, 10, 11 పనుల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏదుల రిజర్వాయర్, పంప్ హౌస్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించిన సీఎం.. కుమ్మెరలోని పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్యాకేజీ-8, స్టేజ్-3 పంప్ హౌస్ పనులపై ఆరా తీశారు.

Palamuru Irrigation Projects | ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదు..
ప్రాజెక్టుల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాలో జూరాల మినహా మరే ప్రాజెక్టూ పూర్తి కాలేదని ఆయన స్పష్టం చేశారు. “కనీసం భూసేకరణ కూడా పూర్తి చేయకుండానే ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేసీఆర్ ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదు” అని ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని.. కానీ గత పాలకులు రూ.27 వేల కోట్ల భారీ వ్యయంతో కేవలం పంపులు, లిఫ్ట్ పనులు చేసి వదిలేశారని, ఫలితంగా ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదని ఆరోపించారు. కమీషన్ల కోసమే వేల కోట్లు దోచుకున్నారని, వాస్తవాలు ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. పంపులు, లిఫ్ట్ పనుల అవినీతిపై మాజీ ఎంపీ నాగం జనార్ధన్ రెడ్డి సుదీర్ఘ పోరాటం చేశారని, కానీ గత సర్కార్ హయాంలో ఆ పనుల పేరిట కొందరి ఇళ్లల్లో కనకవర్షం కురిసిందని విమర్శించారు.

Palamuru Irrigation Projects | రెండేళ్లలో పూర్తి చేస్తాం ..
పాలమూరు ప్రాజెక్టు 90 శాతం పనులు తమ హయాంలోనే పూర్తయ్యాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలను సీఎం తప్పుపట్టారు. రూ. 55 వేల కోట్ల అంచనా వ్యయంలో కనీసం సగం నిధులు కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఇంకా 4 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. భూసేకరణ, ఆర్అండ్ ఆర్ (పునరావాసం) ప్రక్రియ ముగించకుండా రిజర్వాయర్లలో నీళ్లు నింపడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్లలో ఈ పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి పనుల్లో బీఆర్ఎస్ నేతలు అడ్డంకులు సృష్టించకుండా ఉంటే అదే వారు చేసే పెద్ద సహాయమని హితవు పలికారు.
ఇది కూడా చదవండి: CMR Green IPO | ఐపీవోకు భారీ డిమాండ్.. 127 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన ‘సీఎంఆర్’
