Shamshabad Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు బెదిరింపు కలకలం..

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shamshabad Bomb Threat | శంషాబాద్‌లోని (Shamshabad) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో శనివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి హైదరాబాద్‌కు(Hyderabad) వస్తున్న KLM-873 అంతర్జాతీయ విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తుతెలియని వ్యక్తి పంపిన ఈమెయిల్ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో విమానాశ్రయ సిబ్బంది, భద్రతా బలగాలు వెంటనే అత్యవసర చర్యలు చేపట్టాయి.

Shamshabad Bomb Threat | అప్రమత్తమైన యంత్రాంగం..

విమానాశ్రయ అధికారిక ఈమెయిల్‌కు వచ్చిన సందేశంలో, విమానం హైదరాబాద్ చేరుకునేలోపు అందులో ఉన్న బాంబు పేలే అవకాశం ఉందని పేర్కొనడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందిన వెంటనే విమానాశ్రయ ఉన్నతాధికారులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), బాంబు నిర్వీర్య దళం (BDS), శంషాబాద్ పోలీసులు సంయుక్తంగా సమావేశమై భద్రతా చర్యలు చేపట్టారు.

Shamshabad Bomb Threat | అంద‌రు సుర‌క్షితం..

పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌పోర్ట్‌లో Airport అత్యవసర ప్రోటోకాల్ అమలు చేశారు. రన్‌వే ప్రాంతంలో అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు, అత్యవసర సిబ్బందిని ముందుగానే సిద్ధం చేశారు. తీవ్ర ఉత్కంఠ మధ్య KLM-873 విమానం సురక్షితంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయింది.విమానం ల్యాండ్ అయిన వెంటనే దానిని ప్రధాన టెర్మినల్‌కు దూరంగా ఉన్న ఐసోలేషన్ బే ప్రాంతానికి తరలించారు. అనంతరం అధికారులు వేగంగా స్పందించి ప్రయాణికులందరినీ విమానం నుంచి సురక్షితంగా కిందికి దించి ప్రత్యేక వాహనాల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రయాణికుల భద్రతను నిర్ధారించిన తర్వాత బాంబు స్క్వాడ్ బృందాలు అత్యాధునిక పరికరాలు, స్నిఫర్ డాగ్స్ సహాయంతో విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేశాయి. క్యాబిన్ ప్రాంతం, సీట్లు, కార్గో విభాగం, ప్రయాణికుల లగేజీ సహా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

Shamshabad Bomb Threat | ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు..

గంటలపాటు సాగిన తనిఖీల అనంతరం విమానంలో (Aeroplane) ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీంతో వచ్చిన ఈమెయిల్ పూర్తిగా ఫేక్ అలర్ట్ అని తేలింది. ఈ వార్తతో ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనను అధికారులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, వందలాది మంది ప్రయాణికులను భయాందోళనలకు గురిచేయడం నేపథ్యంలో శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రస్తుతం సైబర్ క్రైమ్ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈమెయిల్ ఎక్కడి నుంచి పంపబడింది? దాని వెనుక ఎవరు ఉన్నారు? ఏ ఉద్దేశంతో ఈ తప్పుడు హెచ్చరిక ఇచ్చారు? వంటి కోణాల్లో సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితులను త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Ponguleti Paper Controversy | మంత్రి వాకిటి శ్రీహరి మీద పేపర్లు విసిరేసిన పొంగులేటి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *