అక్షరటుడే వెబ్‌డెస్క్: Fake Medicines | మందులకు నకిలీ లేబుళ్లు వేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న నకిలీ మందుల ముఠా గుట్టును కర్ణాటక ( Karnataka )ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ (FDA) రట్టు చేసింది. నకిలీ మందుల తయారీ, విక్రయాల అక్రమాలకు పాల్పడుతున్న 16 సంస్థల లైసెన్సులను పూర్తిగా రద్దు చేయగా.. ప్రముఖ ఫార్మా దిగ్గజం ఫైజర్ (Pfizer Ltd) నెల్మంగళ డిపోతో సహా మరో 8 సంస్థల హోల్‌సేల్, రిటైల్ లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు.
Fake Medicines | ఫామ్‌హౌస్‌పై దాడులు..
బెంగళూరు సౌత్ జిల్లా బిదది పరిధిలోని కురుబరకేరనహళ్లిలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌పై ఆగస్టు 18న డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడుల్లో దాదాపు రూ.5.05 కోట్ల విలువైన నకిలీ మందులు, ఇంజెక్షన్ ఫిల్లింగ్ యంత్రాలు, నకిలీ లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు మందులు కొనుగోలు చేసి, వాటిని కొత్త సీసాల్లోకి మార్చి బహుళజాతి కంపెనీల ఖరీదైన ప్రాణరక్షణ ఔషధాలుగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా ‘ఫైజర్’ బ్రాండ్ పేరుతో వీటిని చలామణీ చేస్తూ, కొనుగోలుదారులను మోసగించేందుకు నకిలీ QR కోడ్లను కూడా ముద్రించారు. ఎలాంటి ఔషధ గుణాలు లేని ఈ నకిలీ, ఎక్స్పైరీ మందులు ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
Fake Medicines | లైసెన్సులు రద్దయిన సంస్థలు..
ఈ దాడుల నేపథ్యంలో బెంగళూరు రూరల్ జిల్లాలోని ఫైజర్ లిమిటెడ్ డిపోతో పాటు మెడ్ ఫార్మా, సూర్య స్పెషాలిటీ హాస్పిటల్, సాగర్ ఫార్మా యూనిట్-II, వివంత ఫార్మాస్యూటికల్స్, మారుతి మెడికల్స్, వివా ఫార్మా, హై-5 ఫార్మా సంస్థల లైసెన్సులు సస్పెండ్ అయ్యాయి. ఇక ఈ అక్రమాల్లో ప్రత్యక్షంగా భాగమైన మరో 16 హోల్‌సేల్, రిటైల్ సంస్థల లైసెన్సులు పూర్తిగా రద్దయ్యాయి. ఈ దాడుల్లో రూ.3.38 కోట్ల విలువైన CEFIAVIGENT, రూ.52.24 లక్షల విలువైన HIZLAM తో పాటు Xavitaz, Emblaveo, Zavicefta, TIGYNT IV వంటి అత్యంత ఖరీదైన ప్రాణరక్షణ ఇంజెక్షన్లను, రూ.35 లక్షల విలువైన గడువు ముగిసిన మందులను జప్తు చేశారు. సీజ్ చేసిన మందుల బ్యాచ్ నంబర్లను పోర్టల్‌లో బ్లాక్ చేసి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.
Fake Medicines | సిట్ (SIT) దర్యాప్తు..
ఈ ఘటనపై బెంగళూరు పోలీసుల ప్రత్యేక విచారణ బృందం (SIT), డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా దర్యాప్తు వేగవంతం చేశాయి. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్-1940 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఎఫ్‌డీఏ కమిషనర్ తెలిపారు. నకిలీ మందుల తయారీ, అమ్మకాలకు పాల్పడే వారికి 10 ఏళ్ల నుంచి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఎల్లప్పుడూ గుర్తింపు పొందిన మెడికల్ షాపుల నుంచే పక్కా బిల్లుతో మందులు కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: Cases on Farmers | రైతులపై అక్రమ కేసులు.. కేటీఆర్ ఆగ్రహం