AP Local Elections | ఏపీ స్థానిక ఎన్నికల్లో సంచలన పరిణామాలు.. జెడ్పీ చైర్ పర్సన్ పదవి ఆఫర్ చేసిన కూటమి?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం వేడెక్కుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: AP Local Elections | ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సుమారు రెండున్నరేళ్ల తర్వాత జరగబోతున్న ఈ లోకల్ వార్‌ను కూటమి పార్టీలు ప్రభుత్వ పనితీరుకు ఒక పరీక్షలా భావిస్తున్నాయి. మరోవైపు, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని తన పట్టు నిలుపుకునేందుకు వైఎస్సార్‌సీపీ పకడ్బందీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో అధికార కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ రాజకీయ సమీకరణాలను వేగంగా మారుస్తోంది.

AP Local Elections | సొంతగడ్డపైనే చెక్ పెట్టేలా..

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఆయన సొంత ఇలాకాలోనే రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు అధికార కూటమి పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతారెడ్డిని రంగంలోకి దించేందుకు మంత్రి నారా లోకేశ్  ( Nara Lokesh )ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

జగన్ సొంత మండలమైన లింగాలలో జెడ్పీటీసీ స్థానం నుంచి ఆమెను బరిలోకి దించాలని, ఒకవేళ గెలిస్తే ఆమెకు జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పదవిని కట్టబెట్టేలా ప్రతిపాదన చేసినట్లు సమాచారం. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్‌కు వ్యతిరేకంగా కడప ఎంపీ బరిలో నిలిచిన వైఎస్ షర్మిలకు డాక్టర్ సునీత ప్రత్యక్ష మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆమె కూటమి వైపు అడుగులు వేస్తారన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ ప్రచారంపై సునీత తరఫు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆమె స్వయంగా బరిలోకి దిగుతారా లేదా తన కుటుంబం నుంచి మరొకరిని పోటీకి పెడతారా అనేది త్వరలోనే తేలాల్సి ఉంది.

AP Local Elections | ఎన్నికల సంఘం కసరత్తు..

మరోవైపు, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తన కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే 41 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జాబితా పరిధిలోకి 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు వస్తున్నాయి.

2026 జనవరి 1ని అర్హత తేదీగా ప్రాతిపదికన తీసుకుని ఓటర్ల జాబితాల తయారీకి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తుది ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 22న ప్రచురించనున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఇప్పటికే మరో 59 మున్సిపాలిటీలకు కూడా ఇదే రీతిలో నోటిఫికేషన్ జారీ కావడంతో, పురపాలక ఎన్నికల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. త్వరలోనే ఏపీలో స్థానిక ఎన్నికల నగారా మోగనుండటంతో, అధికార కూటమి వర్సెస్ వైఎస్సార్‌సీపీ మధ్య పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:  Ganesh Immersion MMTS Trains | గణేశ్ నిమజ్జనం కోసం.. స్పెషల్ ఎంఎంటీఎస్​ రైళ్లు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *