అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Farmers | తెలంగాణ ( Telangana )రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి ఎద్దడి, తీవ్ర విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతుండటంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ముందస్తు ప్రణాళికారాహిత్యమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ఆరోపించారు. కేవలం కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేయడంతో రైతుల కష్టాలు తీరిపోవని ఎద్దేవా చేశారు.
Harish Rao Farmers | ముందస్తు చర్యలు లేక..
ప్రభుత్వ నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే 20 రోజులు అత్యంత కీలకమని, అధికారులు శ్రద్ధ వహించి తక్షణమే నీరందిస్తే మిగిలిన పంటలనైనా కాపాడుకునే వెసులుబాటు ఉంటుందని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా విద్యుత్ కోతలు, లో-వోల్టేజ్ సమస్యలతో బోర్ల మోటర్లు కాలిపోతున్నాయని, రైతులు తీవ్ర వేదన అనుభవిస్తున్నారని తెలిపారు.
Harish Rao Farmers | కేసీఆర్ పాలనలో అండగా ..
గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఇటువంటి దయనీయ పరిస్థితి ఎన్నడూ రాలేదని హరీష్ రావు స్పష్టం చేశారు. కరోనా వంటి మహమ్మారి సంక్షోభ సమయంలోనూ కేసీఆర్ ప్రజలకు ధైర్యం చెప్పి రక్షణ కవచంలా నిలిచారని ప్రశంసించారు. ఆ కష్టకాలంలో నిరంతర విద్యుత్, సాగునీరు అందించడంతో పాటు విశాఖపట్నం పోర్టు నుంచి ప్రత్యేక అధికారులతో యూరియా తెప్పించారని గుర్తుచేశారు. అంతేకాకుండా బిహార్ నుంచి ప్రత్యేక రైళ్లలో హమాలీలను రప్పించి కోటి టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
Harish Rao Farmers | రైతులను ముంచేస్తున్నారు..
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎల్‌నినోను సాకుగా చూపిస్తూ ప్రజలపై భారం వేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. “డబ్బులు పెడితే నీళ్లు దొరుకుతాయా?” అంటూ బాధ్యతారాహిత్యంగా ఉచిత వ్యాఖ్యలు చేస్తూ, ఎల్‌నినో నెపంతో క్రాప్ హాలిడే ప్రకటించి ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని, పంటలు కోల్పోయి నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని బీఆర్ఎస్ తరపున గట్టిగా డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Amit Shah Rahul Gandhi | మరో 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదు: అమిత్ షా